నల్గొండ, వెలుగు : నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం మధ్య పొలిటికల్ వార్ తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే చిరుమర్తి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచే ఈవేడి మొదలైంది. చిరుమర్తికి వ్యతిరేకంగా పార్టీలోనే ఉంటూ వీరేశం తన బలాన్ని వివిధ రూపాల్లో చూపుతున్నారు. స్థానిక, సహకార ఎన్నికలు, నకిరేకల్, చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో వీరేశం తన వర్గీయులను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మీద నిలబెట్టి సత్తా చాటుకున్నారు. అయితే చిరుమర్తి, వీరేశం మధ్య రాజీ కుదిర్చించేందుకు జిల్లా ముఖ్యనేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పైగా చిరుమర్తికి వ్యతిరేకంగా పార్టీలో కొనసాగుతూనే వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు.
వీరేశాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు చిరుమర్తి కాంగ్రెస్, బీఆర్ఎస్లో కేడర్‌ను తన వైపు తిప్పుకున్నారు. వివిధ అభివృద్ధి పనులను సాంక్షన్ చేయించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ రచ్చకెక్కింది. వీరేశం ఇప్పటి నుంచే బలప్రదర్శనకు దిగారు. దీనిలో భాగంగా వీరేశం బర్త్‌డే వేడుకులకు పొలిటికల్ కలర్ ఇచ్చారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బర్త్‌డే వేడుకలకు భారీ జనసమీకరణ చేశారు. దీంతోపాటు బీఆర్ఎస్ టికెట్ తన దేనని ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్‌ల పైన తనకు అపారమైన నమ్మకం ఉందని పబ్లిక్‌లో ప్రకటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అండతోనే నకిరేకల్‌లో మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిరుమర్తి రెం డు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
బ్రదర్స్‌ను కాదని పార్టీ మారి, బీఆర్ఎస్లో ఎదురీత తప్పలేదు. వీరేశం ఎన్నికల్లో ఓడిపోయాక కూడా ఆయన నుంచి ఎదురైన అవమానాలు తట్టుకోలేకనే పార్టీ మారాల్సి వచ్చిందనే విషయాన్ని చిరుమర్తి పార్టీ కేడర్‌కు వివరించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండా న రేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ చిరుమర్తికి అండగా నిల బడ్డారు.చిరుమర్తి బీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి వీరేశం పొలిటికల్ స్టాండ్ పూర్తి గా మార్చేశారు. తన కేడర్‌ను కాపాడుకునేందుకు ఎమ్మెల్యే పైన ఎదురుదాడికి దిగారు. మంత్రి హారీశ్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరె డ్డితో టచ్‌లో ఉంటూ.. గ్రౌండ్ వర్క్ పైనే ఫోకస్ పెట్టారు.
ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్న కృష్ణారెడ్డి, బీసీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శం బయ్య వీరేశానికి అండగా నిలబడ్డారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీని వీడటంతో అందరి దృష్టి వీరేశం పై పడింది. పొంగులేటితో వీరేశానికి ఉన్న సన్నిహిత సంబంధాలు రాజకీయంగా పలు అనుమానాలకు దారితీశాయి. కానీ ఊహించని రీతిలో వీరేశం తనకే టికెట్ వస్తదని, కేసీఆర్ పైన నమ్మకం ఉందని ప్రకటించడం ఆసక్తిగా
మారింది.
టికెట్ ఎవరికో...
బీఆర్ఎస్ టికెట్ తనకే ఖాయమంటున్న ఎమ్మెల్యే చిరుమర్తి అదే విషయాన్ని నేరుగా కేసీఆరే చెప్తాడని ఆశిస్తున్నారు. ఇందుకోసం బ్రహ్మణ వెల్లంల రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీంతోపాటే మరిన్ని అభివృద్ధి పనులకు సీఎంతో శంకుస్థాపన చేయించాలనే ప్లాన్‌లో ఉన్నారు. అయితే చిరుమర్తి అనుకున్నది నెరవేరుతుందా? లేకా ఎలక్షన్ వరకల్లా పరిస్థితులు మారుతాయా అన్నది ఆసక్తికరమే. మరోవైపు వీరేశం కూడా సొంత ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ టైం వరకు టికెట్ వస్తదనే నమ్మకంతోనే పార్టీలో కొనసాగి, ఒకవేళ హైకమాండ్ చివరి నిమిషంలో హ్యాండిస్తే అదే సానుభూతితో రెబెల్‌గా మారి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదు.