జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్టోబర్ 18న పీఎస్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న లాకావత్ శ్రీను అనే వ్యక్తి మృతికి కారణం పోలీసులేనంటూ ఆందోళనకు దిగారు అతని బంధువులు,కుటుంబ సభ్యులు. కొండాపురం మేకల తండా గ్రామస్థులతో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా తరలివచ్చారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
శ్రీను చావుకు కారణమైన నిందితులను తమకు చూపించాలంటూ స్టేషన్ లోపలికి దూసుకొచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, ఆందోళన కారులకు మద్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఈ ముట్టడిలో బీఆర్ఎస్ నాయకులు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు. ఎస్సై సాయి ప్రసన్న కుమార్ ను వెంటనే సస్పెండ్ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మెయిన్ రోడ్డుపై కూర్చొని రాస్తారోకో చేపట్టారు.
మరో వైపు ఆత్మహత్య చేసుకున్న శ్రీను మృతదేహానికి నివాళి అర్పించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వీ రెడ్డి. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. శ్రీను ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.