హైదరాబాద్ శివారు షాద్ నగర్‌లోని జల్పల్లిలో ఉన్న ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. మోహన్ బాబు ఇంటికి వచ్చిన ఆయన కుమారుడు మంచు మనోజ్, అతడి భార్య మౌనికను ఇంట్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ కారును ఇంటి బయట గేట్ దగ్గరే సిబ్బంది ఆపేశారు. కారు దిగిన మనోజ్ దంపతులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో చాలా సేపు గేట్ వద్దే నిల్చున్న మనోజ్ తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తన కూతురు ఇంట్లో ఉందని.. లోపలికి వెళ్లానివ్వాలని కోరాడు.
అయినప్పటికీ మనోజ్‌ను ఇంట్లోకి రానిచ్చేందుకు సిబ్బంది అనుమతించకపోవడతో చేసేదేమి లేక బలవంతంగా గేట్లు తోసుకుని మనోజ్ ఇంట్లోకి వెళ్లాడు. దీంతో జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. ఇంటి బయట మనోజ్, మోహన్ బాబు వర్గాలకు చెందిన బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బందిని పెద్ద ఎత్తున మోహరించడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల బౌన్సర్లను ఇంటి నుండి బయటకు పంపేశారు. ఈ క్రమంలో ఇంట్లోకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు.
దీంతో మోహన్ బాబు తీరుపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే మోహన్ బాబు మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. కాగా, గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మనోజ్, మోహన్ బాబు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2024, డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ డీజీపీని కలిసిన మనోజ్ తనకకు ప్రాణ హాని ఉందని.. భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాడు. పోలీసులను కలిసి అనంతరం మోహన్ బాబు ఇంటికి వెళ్లగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది.