- పీఎల్జీఏ వారోత్సవాల్లో బేస్ క్యాంపులపై మావోయిస్టుల దాడులు
- ఇన్ఫార్మర్ల వేట.. మందుపాతర్లు ఏర్పాటు చేసి దుశ్చర్యలు
భద్రాచలం, వెలుగు : తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒడిశా, ఏపీ బార్డర్ఆదివాసీ గ్రామాలతో పాటు అడవుల్లో విస్తరించిన దండకారణ్యంలో హైటెన్షన్ నెలకొంది. మావోయిస్టుల కంచుకోటగా పిలవబడే ఆ ప్రాంతంలో కేంద్ర బలగాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దీంతో ఎన్కౌంటర్లు జరుతుండగా.. తమ దళాలను కోల్పోతున్న మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు ప్రతీకార దాడులకు దిగుతున్నారు.
గత 11 నెలల్లో 192 మంది మావోయిస్టులను కేంద్ర బలగాలు మట్టుబెట్టాయి. కొత్తగా బేస్‌క్యాంపులను ఏర్పాటు చేసుకుని అబూజ్ మడ్ లో జెండా పాతాయి. మరో వైపు సేఫ్ జోన్లను వెతుక్కుంటూ వెళ్తున్న దళాలను వెంటాడి ఎన్కౌంటర్లు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరునాగారం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటరే ఉదాహరణ. ముఖ్యమైన క్యాడర్ తుడిచిపెట్టు కుపోతుండగా, ఆత్మస్థైర్యం కోల్పోతున్న కేడర్ లో పార్టీ ఉత్సాహం నింపేందుకు పీఎల్ జీఏ వారోత్సవాల సాక్షిగా దూకుడు పెంచింది.
ఇన్ఫార్మర్లను వెంటాడి.. కిడ్నాప్ చేసి..
దళాల సమాచారం పోలీసులకు ఇస్తున్నారనే నెపంతో గ్రామాల్లో ఇన్ఫార్మర్లను వెంటాడి, కిడ్నాప్‌చేసి మావోయిస్టులు హతమార్చుతున్నారు. ఇటీవల చత్తీస్గడ్ లోని బీజాపూర్ జిల్లా పుత్కేల్లో దినేశ్ పూజారి అనే వ్యక్తిని కిడ్నాప్‌చేసి హత్య చేశారు. ఇదే జిల్లాలోని జాంగ్లా పీఎస్ పరిధిలోని పొటేనార్అడవుల్లో మడవి దూలార్ను, కుంజా కామేశ్అనే ఆదివాసీని చంపేశారు. బీజాపూర్జిల్లాలోనే బైరంగఢ్ పీఎస్ పరిధిలోని కడేల్మాజీ సర్పంచ్సుఖ్రామ్ , బిరియా భూమి మాజీ సర్పంచ్సుక్లూ ఫర్సాలను గురువారం దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
స్మాల్ యాక్షన్ టీంలు.. పీఎల్‌జీఏతో దాడులు
బేస్‌క్యాంపులను పెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేంద్రబలగాలకు మావోయిస్టులు ఝలక్ ఇస్తున్నారు. స్మాల్యాక్షన్టీంలను రంగంలోకి దించారు. తాజాగా సుక్మా జిల్లా జేగురుగొండ బేస్ క్యాంపు సమీపంలో వారపు సంతలో ఆదివాసీల వేషధారణలో వచ్చిన స్మాల్యాక్షన్ టీం సభ్యులు డీఆర్జీ సిబ్బందిపై దాడి చేసి జవాన్లు కర్తం దేవా, సోడె కన్నా హతమార్చి.. ఏకే-47, ఎస్ఎల్ తుపాకులను ఎత్తుకెళ్లారు.
చింతలనార్ పీఎస్ పరిధిలోని రాయగూడలోని కొత్త బేస్ క్యాంపును టార్గెట్ గా చేసుకుని చుట్టుపక్కల దారుల్లో మందుపాతర్లను ఏర్పాటు చేశారు. మందుపాతర పేలి జవాను పొడియం వినోద్తీవ్రంగా గాయపడ్డాడు. భద్రాచలం డివిజన్చర్ల మండలం పూసుగుప్ప, బార్డర్‌లోని ధర్మారం, పామేడు,చింతవాగు బేస్క్యాంపులపై రాకెట్ లాంచర్లతో దాడులకు దిగారు.
ఆదివాసీ గూడెల్లో టెన్షన్
మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, దేవాల సొంతూరు పువ్వర్తిలో కేంద్రం బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. దీంతో పువ్వర్తి, గుండం, బట్టిగూడలో డ్రోన్లతో జవాన్లు దాడి చేస్తున్నారని ఆదివాసీలు ఆరోపించారు. ఇండ్లతో పాటు చెట్లపై ఆయుధ శకలాల వీడియో తీసి మీడియాకు పంపారు. దీనికి తోడు వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టులను కలవరపెడుతుండగా.. తాడోపేడో తేల్చుకునేందుకు పీఎల్జీఏను రంగంలోకి దించారు.
భారీ ఎత్తున మిలీషియా సభ్యులు బేస్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. దీంతో దండకారణ్యంలోని పీఎస్ లతో పాటు, బేస్ క్యాంపులకు పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేపట్టారు. ఈనెల 9 వరకు వారోత్సవాలు ఉన్నందున భద్రాచలం మన్యంలోని ఇసుక ర్యాంపులను కూడా మూసేశారు.
రాత్రి వేళల్లో బస్సులను హాల్ట్ చేయకుండా ఆర్టీసీ జాగ్రత్తలు తీసుకుంటుంది. సమీప పోలీస్స్టేషన్లకు రాత్రి బస్సులను తరలిస్తున్నారు. నేతలను పట్టణాలకు వెళ్లిపోవాలని నోటీసులు జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు టెన్షన్ తప్పేలా లేదని ఆదివాసీలు భయంతో వణికిపోతున్నారు.