హైదరాబాద్​లో హైటెన్షన్ కేబుల్​కు మంటలు

హైదరాబాద్​లో హైటెన్షన్ కేబుల్​కు మంటలు
  • కొన్ని నిమిషాల్లోనే రాయదుర్గం, మియాపూర్ ​ఫీడర్​ ట్రిప్​ 
  • పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన కరెంట్​
  • యుద్ధ ప్రాతిపదికన స్పందించిన సిబ్బంది
  • ప్రత్యామ్నాయ మార్గాల్లో కరెంట్​ పునరుద్ధరణ
  • ఎన్నికల ముందురోజే ఘటన జరగడంపై అనుమానాలు
  • బరితెగించిన దుర్మార్గులంటూ డిస్కం ట్వీట్​
  • దర్యాప్తునకు ఆదేశించిన ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ రిజ్వీ
  • ప్రమాదమా? కుట్రా? అనే కోణంలో పోలీసుల విచారణ

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్​ సిటీలోని మియాపూర్​లో 220/132 కేవీ సబ్​స్టేషన్లను కలిపే హైటెన్షన్​ యూజీ  కేబుల్ ఆదివారం ఉదయం  కాలిపోయింది. మియాపూర్​– రాయదుర్గం లేన్​లో ఉదయం 6.30 గంటలకు మంటలు చెలరేగి, కేబుల్ ​అంటుకున్నది. దీని ప్రభావంతో కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాయదుర్గం, మియాపూర్​ ఫీడర్​ ట్రిప్​ అయ్యింది.

దీంతో మియాపూర్​132 కేవీ, కైతలాపూర్​132 కేవీ సబ్​ స్టేషన్ల పరిధిలోని మేడ్చల్, సైబర్​ సిటీ సర్కిల్​లో కరెంటు సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. విద్యుత్​ అధికారుల సమాచారంతో ఫైర్​ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. 

సదరన్​ డిస్కం సీఎండీ ముషారఫ్​ ఫరూఖీ, ట్రాన్స్​ కో ట్రాన్స్ మిషన్​  డైరెక్టర్​ జగత్​రెడ్డి, మాదాపూర్​ జోన్​ డిప్యూటీ కమిషనర్​ వినీత్​, ఫైర్​ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిమిషాల వ్యవధిలోనే విద్యుత్​సరఫరాను పునరుద్ధరించారు.  పీక్ ​డిమాండ్​ఉన్న టైమ్​లో.. తెల్లారితే ఎన్నికలనగా కేబుల్ ​కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘దుర్మార్గులు బరితెగించారు’ అంటూ  డిస్కం కూడా ట్వీట్ చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నది. ఈ ఘటనపై ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ రిజ్వీకూడా పోలీస్​ దర్యాప్తునకు ఆదేశించడంతో ఉత్కంఠ నెలకొన్నది. 

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ

సాఫ్ట్​వేర్​ సంస్థలుండే కీలకమైన ఏరియాలో కరెంట్​సప్లై నిలిచిపోవడంతో విద్యుత్​ అధికారులు , సిబ్బంది యుద్ధప్రాతిపదికన స్పందించారు. కేవలం 29 నిమిషాల్లో ఆల్టర్నేట్​ రూట్​లో ఫీడర్లు మార్చి సరఫరాను పునరుద్ధరించారు. అప్పటికే పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తం కాకపోతే భారీ ప్రమాదం జరగడంతో పాటు చాలా ఏరియాల్లో కరెంట్​ సప్లై నిలిచిపోయి.. నష్టం వాటిల్లేదని తెలుస్తున్నది.

ఘటనపై అనుమానాలు 

విద్యుత్​సబ్​ స్టేషన్లకు కరెంటు సరఫరా చేసే హైటెన్షన్ కేబుల్ ​కాలిపోయిన ఘటనపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం లోక్​సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో కావాలనే కరెంట్​పై సర్కారును బద్నాం చేసే కుట్ర జరిగిందా? అనే కోణంలో విద్యుత్​ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ హైటెన్షన్​ కేబుల్ సుమారు 200 మెగావాట్ల పవర్​ను  క్యారీ చేస్తుంది.  అంటే ఆ టైమ్​లో హైదరాబాద్​ సిటీలో సరఫరా అయ్యే కరెంటులో 10 శాతం దీని ద్వారా అందుతుంది. మొన్నటి ఎండల్లో కరెంట్​కు ఫుల్ ​డిమాండ్​ఉన్న టైమ్​లోనూ ఈ కేబుల్ ​కాలిపోలేదు.

అలాంటిది ఆదివారం ఉదయం, పవర్​ డిమాండ్​ అంతగా లేని టైంలో కేబుల్​కు మంటలు అంటుకోవడంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ​సర్కారు అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా పలుచోట్ల సబ్​స్టేషన్లలో ప్రమాదాలు జరిగాయి. ఇటీవల సూర్యాపేట, మహబూబ్​నగర్​ జిల్లాల్లో ఎలాంటి కరెంట్​ కోతలు లేకున్నా ఓ పార్టీ నేతలు కాంగ్రెస్​సర్కారు కరెంట్​సరిగ్గా సరఫరా చేయడం లేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తాజా ఘటనపై  ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ రిజ్వీ పోలీసు​ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, ఎన్నికల  నేపథ్యంలో ఎవరైనా కావాలనే కేబుల్​కు నిప్పు పెట్టారా? అనే కోణంలో సైబరాబాద్​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.