హనుమకొండ/వరంగల్/కాజీపేట, వెలుగు: బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ ఒసందర్భంగా ఓరుగల్లులో శనివారం టెన్షన్ వాతావరణం కనిపించింది. హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద ర్యాలీ ప్రారంభం కాగా.. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు. కేయూ జంక్షన్ నుంచి నయీంనగర్, పెట్రోల్ బంక్, సీపీ ఆఫీస్ మీదుగా అంబేద్కర్ జంక్షన్ వరకు నిరుద్యోగ మార్చ్ సాగింది. ‘ప్రభుత్వ ఉద్యోగాల కోసం కలలు కనడం తప్పా?’, ‘టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి’ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవున నిరుద్యోగ మార్చ్ ప్రశాంతంగా సాగింది. అయితే, ర్యాలీ సందర్భంగా ఓరుగల్లులో కమిషనరేట్ ఫోర్స్ మొత్తాన్ని దింపారు. కేయూ జంక్షన్ నుంచి అంబేద్కర్సెంటర్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మార్గంలోనే సుమారు వెయ్యి మంది పోలీసులు మోహరించారు.
కమిషనరేట్ లోని డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు అంతా ఇక్కడికే చేరుకున్నారు. వారితో పాటు మొబైల్ కమాండ్ కంట్రోల్ రూమ్, రబ్బర్ బుల్లెట్స్ వెహికల్, టియర్ గ్యాస్ వెహికల్స్ నూ రంగంలోకి దించారు. వరంగల్ సీపీ ఆఫీస్ వద్ద ముళ్ల కంచె, బారికేడ్లతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేవలం ఒక మార్గంలోనే ర్యాలీకి పర్మిషన్ ఇచ్చి ఇంకో మార్గాన్ని మూసివేశారు. ర్యాలీ వరంగల్ సీపీ ఆఫీస్ వద్దకు చేరుకోగానే.. బీజేపీ కార్పొరేటర్ చాడ స్వాతి రెడ్డి, ఏబీవీపీ నేతలు బారికేడ్లతో మూసి ఉన్న మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం జరిగింది. కమిషనరేట్ ఎదుటే గందరగోళం నెలకొనడంతో బీజేపీ నేతలను పోలీసులు లాక్కెళ్లారు.
కేయూ వద్ద టెన్షన్
కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ శనివారం ఉదయం బీఆర్ఎస్వీ నాయకులు మోడీ దిష్టిబొమ్మతో కేయూ ఫస్ట్ గేట్ ఎదుట నిరసనకు దిగారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు నిప్పంటించారు. అక్కడున్న నిరుద్యోగ మార్చ్ ఫ్లెక్సీని చించేసి దిష్టిబొమ్మతో సహా తగులబెట్టారు. దీంతో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్(పీవోహెచ్) ఏర్పాటుకు సంబంధించిన పనులు స్టార్ట్ చేసేందుకు సహకరించాలని రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో బండి సంజయ్ కి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పీవోహెచ్ నిర్మాణానికి అవసరమైన పూర్తి భూమిని అందిస్తే.. త్వరలోనే ప్రధాని మోడీ చేతుల మీదుగానే పనుల ప్రారంభోత్సవం జరిగేలా కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రావు పద్మ ఆధ్వర్యంలో బండి సంజయ్ ని కలిసినవారిలో రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ ఉన్నారు.