హైదరాబాదు, వెలుగు: లాజిస్టిక్స్ సేవల సంస్థ వీట్రాన్స్ (ఇండియా) రాబోయే మూడు సంవత్సరాలలో రూ.3,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలనే టార్గెట్తో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం బిజినెస్ విస్తరిస్తామని, ఫలితంగా మొత్తం 600 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లతో సహా దక్షిణాదిన పెద్ద ఎత్తున విస్తరిస్తామని వెల్లడించింది. గిడ్డంగులను, కొత్త బ్రాంచ్ల కోసం భారీగా పెట్టుబడులు పెడతామని తెలిపింది.
కొత్త శాఖలు దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాల్లో, పట్టణాల్లో ఏర్పాటవుతాయి. వీటిలో హైదరాబాదు, బెంగళూరు, కోయంబత్తూరు వంటి నగరాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సంస్థ వెయ్యికి పైగా బ్రాంచ్లు, 50 కి పైగా ట్రాన్స్షిప్మెంట్స్ కేంద్రాలు, లొకేషన్ ట్రాకింగ్ సదుపాయం ఉన్న 2,500 ట్రక్కులు ఉన్నాయి. ఇటీవల ప్రకటించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ వల్ల లాజిస్టిక్పరిశ్రమకు మరింత మేలు జరుగుతుందని, రవాణా సమయం, ఖర్చు తగ్గుతుందని వీట్రాన్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మహేంద్ర షా అన్నారు.
‘‘ప్రస్తుతం మాకు తెలంగాణలో 50 బ్రాంచ్లు ఉన్నాయి. త్వరలో మరో పదింటిని ఏర్పాటు చేస్తాం. దేశవ్యాప్తంగా కొత్తగా 100కుపైగా బ్రాంచ్లను ఏర్పాటు చేస్తాం. లాజిస్టిక్స్ పాలసీ వల్ల రవాణా ఖర్చు దాదాపు 8 శాతం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ కోసం అంతర్గత నిధులు, బ్యాంకు లోన్లను వాడుకుంటాం”అని అన్నారు.