
- ఓటు హక్కు వినియోగించుకున్న గ్రాడ్యుయేట్లు, టీచర్లు
మెదక్/ సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో ప్రశాతంగా జరిగింది. మెదక్లో సాయంత్రం నాలుగు గంటల వరకు గ్రాడ్యుయేట్ పోలింగ్ 95.03 శాతం కాగా, టీచర్స్ పోలింగ్ 75.26 శాతం నమోదైంది. టీచర్స్ కంటే గ్రాడ్యుయేట్స్ ఎక్కువ శాతం ఓటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, టీచర్స్ యూనియన్ నాయకులు పోలింగ్ కేంద్రాల సమీపంలో టెంట్లు వేసుకుని గ్రాడ్యుయేట్స్ , టీచర్స్ ను పోలింగ్ కేంద్రాలకు రప్పించి , ఓటు హక్కు వినియోగించుకునేలా చూశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చిన్నశంకరంపేటలో, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి శివ్వంపేటలో, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హవేలి ఘనపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ చోట్ల పోలింగ్ తీరును పరిశీలించారు.
సిద్దిపేటలో మందకొడిగా ప్రారంభమై పుంజుకున్న పోలింగ్
సిద్దిపేట జిల్లాలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. గ్రాడ్యుయేట్ల కోసం 40, టీచర్స్ కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 32589 గ్రాడ్యుయేట్ ఓటర్లుండగా 23736 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 72.83 పోలింగ్ శాతం నమోదైంది. జిల్లాలో టీచర్స్ ఓటర్లు 3212 వుండగా 3046 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలైన టీచర్స్ ఓట్ల లో పురుషులు-1925 మహిళలు -1121 ఉండగా 94.83 పోలింగ్ శాతం నమోదైంది.
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోకి వచ్చే సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దుల్మిట్ట మండలాల్లో 166 మంది టీచర్ ఓటర్ల కు గాను156 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 94 శాతం పోలింగ్ నమోదైంది. హుస్నాబాద్ పట్టణం లోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, అక్బర్ పేట భూంపల్లిలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు దంపతులు, సిద్దిపేట డిగ్రీ కళాశాలలో పీఆర్టీయూ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, గజ్వేల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రాడ్యుయేట్ బీజెపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి సిద్దిపేట పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరితో కలిసి ఎన్నికల పరిశీలకులు జ్యోతి బుద్ధ ప్రకాశ్సందర్శించారు.
సంగారెడ్డిలో..
జిల్లాలో గ్రాడ్యుయేట్స్ పోలింగ్ 73.19 శాతం, టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ 92.57 శాతం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం 2,690 మంది టీచర్లు ఓటు హక్కు కలిగి ఉండగా, 2,490 (92.57 శాతం) మంది ఓటు వేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 25,652 మంది ఓటర్లు ఉండగా, 18,774 (73.19 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు 667 మంది ఆఫీసర్లు విధులు నిర్వహించారు. సంగారెడ్డి డివిజన్లో 11, జహీరాబాద్ 6, ఆందోల్-జోగిపేట 4, నారాయణఖేడ్ డివిజన్ లో 7 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.