హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా స్పందించకపోవడంపై సహకార శాఖ కమిషర్, రిజిస్ట్రార్ హరితపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాగైతే కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. జాప్యంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను అక్టోబరు 18వ తేదీకి వాయిదా వేసింది.
గత మేనేజింగ్ కమిటీ అవకతవకలపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదని జూబ్లీహిల్స్ సొసైటీ మాజీ కార్యదర్శి మురళీ ముకుంద్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి శుక్రవారం విచారించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ ఎం.హరిత వ్యక్తిగతంగా హాజరయ్యారు. వారిపై కోర్టు ఫైర్ అయ్యింది.