- ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై ఇచ్చిన అనర్హత పిటిషన్‌లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ ఆఫీసుతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కూనం పాండు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అనర్హత పిటిషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, అందుకు కాస్త గడువు కావాలని కోరారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌లను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను జులై 27కి వాయిదా వేసింది.