కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై స్టేకు నిరాకరించిన హైకోర్ట్

కామారెడ్డి టౌన్ మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు స్టే కు నిరాకరించింది . కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్  ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ను ప్రతివాదులుగా తేల్చారు.

పిటిషన్ ను విచారించిన హైకోర్ట్.. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని తెలిపింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్లతరబడి ఊగిసలాట కొనసాగుతుందని.. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా  రైతుల నుంచి  అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 

ఇవాళ మున్సిపల్​ ఎదుట రైతుల మహా ధర్నా

మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా బుధవారం మున్సిపల్​ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ధర్నాకు దిగింది . అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవాళ చివరి రోజు ఉన్న దృష్ట్యా రైతులు ధర్నా చేస్తున్నారు.  

కామారెడ్డి కొత్త టౌన్ ప్లానింగ్ పై  గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్లాన్​కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, ప్లాన్​ మార్చాలని డిమాండ్​ చేస్తూ  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వచ్చాయి. ఇంకా కూడా వచ్చే అవకాశముంది. ప్లాన్​లో ప్రతిపాదించిన ఇండస్ర్టియల్ జోన్​, గ్రీన్ ​జోన్​, 100 ఫీట్ల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతోపాటు, కలెక్టర్​కు అభ్యంతరాలు ఇచ్చారు.