హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన యూజీసీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే యూజీసీ డ్రాఫ్ట్ పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని స్పష్టం చేశారు. గురువారం టీజీసీహెచ్ఈ ఆఫీసులో తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. యూజీసీ నివేదిక పై స్టడీ చేస్తున్నట్టు చెప్పారు. దీనికోసం పలువురు ప్రొఫెసర్లతో కమిటీ వేశామని వెల్లడించారు. వీసీలు, ప్రొఫెసర్ల నియామకంలో యూజీసీ మార్పులు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
యూజీసీ ప్రతిపాదించిన ముసాయిదా అమల్లోకి వస్తే వర్సిటీల్లో వీసీల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదని, కేంద్రం (గవర్నర్) ఎవరినైనా నియమించొచ్చని తెలిపారు. వర్సిటీ వీసీల పదవీకాలాన్ని ఐదేండ్లకు పెంచడమనేది స్వాగతించదగ్గ విషయమేనని, ఐదేండ్ల కాలంలో వర్సిటీలను డెవలప్ చేయొచ్చని చెప్పారు. డిగ్రీ, పీజీలో ఏ సబ్జెక్టు చదివినా, నెట్ లో అర్హత సాధించే సబ్జెక్టుతో ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించే అవకాశం సరికాదన్నారు.
దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు నిధులను ఇవ్వకుండా పెత్తనమేందని ఆయన ప్రశ్నించారు. యూజీసీ ఇచ్చిన ఒక విధానం పూర్తిస్థాయిలో అమలు కాకముందే దానిస్థానంలో వెనువెంటనే మరో నూతన సంస్కరణలు తీసుకోరావడంతో రెండింటిలో ఏదీ అమలుకాకుండా పోతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే వర్సిటీ వీసీలతో ఆయన సమావేశమవుతారని బాలకిష్టారెడ్డి చెప్పారు.
.