విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకం : బాలకృష్ణారెడ్డి

విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకం : బాలకృష్ణారెడ్డి
  • హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి

ముషీరాబాద్, వెలుగు: విద్యార్థి జీవితంలో ఉన్నత విద్య చాలా కీలకమని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. శనివారం బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల నేషనల్​సెమినార్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి పాల్గొని స్టూడెంట్లకు పలు సూచనలు చేశారు. 

సందేహాలను నివృత్తి చేశారు. ఉన్నత విద్యతో అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కాలేజీ సెక్రెటరీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించారు. కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు అనేక అంశాలపై లోతుగా అన్వేషణ చేయాలన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో విశ్లేషణ చాలా అవసరమన్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం మాట్లాడుతూ.. విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని, నేషనల్ సెమినార్లతో విద్యార్థుల ఆలోచనా విధానం మెరుగుపడుతుందని తెలిపారు.

 పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ ఆమన్ దీప్ కౌర్ పాల్గొని పలు విషయాలను విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం ఫ్యాకల్టీ స్టూడెంట్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రొఫెసర్ రామకృష్ణ, ప్రొఫెసర్ రాధిక, ప్రిన్సిపాల్ మట్ట శేఖర్, కో కన్వీనర్ రూప, స్టూడెంట్లు పాల్గొన్నారు.