టెక్నాలజీపై దృష్టి పెట్టాలి... ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి

టెక్నాలజీపై దృష్టి పెట్టాలి... ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి

ముషీరాబాద్, వెలుగు : విద్యా వ్యవస్థలో మార్పు నిరంతర ప్రక్రియ అని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. స్టూడెంట్లు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని పెంచుకుంటూ, కొత్త వాటిని నేర్చుకోవాలని సూచించారు. గురువారం బాగ్ లింగంపల్లి లోని ‘కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్’ లో ఇంటర్మీడియట్, డిగ్రీలో చేరిన స్టూడెంట్లకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లింబాద్రి, అంబేద్కర్ ఇన్​స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ సరోజ వివేక్ హాజరై మాట్లాడారు. స్టూడెంట్లు చదువుకొని ఉన్నతంగా స్థిరపడి జీవితానికి సరిపడే జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలని సూచించారు. అదే తరుణంలో అధ్యాపకులు మంచి విద్యను అందించాలని.. కాలేజీ మేనేజ్మెంట్ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని తెలిపారు. స్టూడెంట్లు సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ అంది వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టూడెంట్లు, తల్లిదండ్రులు, లెక్చరర్స్ పాల్గొన్నారు.