హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్​గా ప్రొఫెసర్ లింబ్రాది

  • మూడేండ్ల కాలానికి నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు
  • వైస్ చైర్మన్​గా రిటైర్ ప్రొఫెసర్ మహమూద్ నియామకం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీఎస్ సీహెచ్ఈ) చైర్మన్​గా ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి నియమితులయ్యారు. రెండేండ్ల నుంచి ఇన్​చార్జ్ చైర్మన్​గా కొనసాగుతున్న ఆయనకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు సోమవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నెంబర్ 42 రిలీజ్ చేశారు. మూడేండ్ల పాటు ఆయన కౌన్సిల్ చైర్మన్​గా కొనసాగనున్నారు. కాగా, 2017 ఆగస్టు 7న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా ప్రభుత్వం ఆయన్ను నియమించింది. అప్పటి నుంచి డిగ్రీలో ఆన్​లైన్ అడ్మిషన్ల ప్రక్రియ దోస్త్ కు కన్వీనర్ గా పనిచేస్తున్నారు. వైస్ చైర్మన్​గా నిర్ణీత మూడేండ్ల కాలం ముగిసినా, కరోనా నేపథ్యంలో ఆయన్నే కంటిన్యూ చేసింది. అదేటైంలో 2021 ఆగస్టులో అప్పటి కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ పాపి రెడ్డిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించగా, అఫిషియేటివ్‌‌ చైర్మన్ లింబాద్రికి బాధ్యతలిచ్చింది. దాదాపు రెండేండ్లు ఇన్​చార్జ్​ చైర్మన్​గా ఉన్న లింబాద్రికి ప్రభుత్వం పూర్తి స్థాయి చైర్మన్​గా నియమించింది. అదేవిధంగా, టీఎస్​సీహెచ్ఈ వైస్ చైర్మన్ గా ప్రొఫెసర్ ఎస్​కే మహమూద్ ను నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబర్ 43 రిలీజ్ చేశారు.

ALSOREAD:గవర్నమెంట్​ స్కూళ్లను నిర్వీర్యం చేసిన్రు

కూలీ నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్​గా..

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ లింబాద్రికి వివాదరహితుడిగా మంచి పేరుంది. దళిత కుటుంబంలో పుట్టిన ఆయన ఎంతో కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించారు. ఓ దశలో చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు. తండ్రి సూచన మేరకు మళ్లీ స్టడీ కొనసాగించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా ఉన్న ఆయన, వచ్చే నెలల్లో రిటైర్డ్ కానున్నారు. జూన్ 1991 నుంచి నవంబర్ 1999 వరకు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్​గా, 2005 మే నుంచి జులై 2007 వరకు సికింద్రాబాద్ పీజీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్​గా సేవలందించారు. ఏప్రిల్ 2008 నుంచి జూన్ 2012 దాకా ఓయూ అకడమిక్ ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్​గా పనిచేశారు. నవంబర్ 2014 నుంచి 2017 వరకు తెలంగాణ వర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్​ బీవోఎస్ చైర్మన్​గా, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్​గా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఏప్రిల్ 4, 2013 నుంచి 2016 జులై 28 వరకు రెండు సార్లు తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్​గా పనిచేశారు.