- పీఎం విద్యాలక్ష్మి స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
- ఎఫ్‌సీఐకి రూ.10,700 కోట్లు కేటాయించేందుకూ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఉన్నత చదువులు చదివే స్టూడెంట్లకు ఆర్థికంగా సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందే స్టూడెంట్లకు లోన్లు ఇచ్చేందుకు పీఎం–విద్యాలక్ష్మి స్కీమ్ ను తెచ్చింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024–25 నుంచి 2030–31 వరకు మొత్తం రూ.3,600 కోట్లతో ఈ స్కీమ్ ను అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సీఐ)కు రూ.10,700 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ మొత్తాన్ని 2024---–25 ఫైనాన్సియల్ ఇయర్ కు గాను వర్కింగ్ క్యాపిటల్ కింద ఇవ్వనుంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం-–విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.
ఇదీ పీఎం-విద్యాలక్ష్మి..
పీఎం-–విద్యాలక్ష్మి స్కీమ్ కింద దేశంలోని క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ (క్యూహెచ్ఈఐ)లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ద్వారా లోన్ లభిస్తుంది. నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ద్వారా ప్రకటించే టాప్ 860 క్యూహెచ్ఈఐలలో అడ్మిషన్లు పొందే స్టూడెంట్లు ఈ పథకానికి అర్హులు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాసంస్థలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలూ ఉంటాయి.
ఈ పథకం కింద రూ.7.5 లక్షల వరకు విద్యార్థులకు రుణం ఇస్తారు. ఇందులో 75 శాతం రుణానికి బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. దీనికి అదనంగా ఒకవేళ స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్ కమ్ రూ.8 లక్షల కంటే తక్కువ ఉండి, ఏ ప్రభుత్వ పథకం/స్కాలర్ షిప్ గానీ పొంది ఉండకపోతే.. రూ.10 లక్షల వరకు లోన్ ఇవ్వడంతో పాటు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తారు. ప్రతిఏటా లక్ష మంది స్టూడెంట్లకు వడ్దీ రాయితీ ఇస్తారు. ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. సెంట్రల్ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో పీఎం–విద్యాలక్ష్మీ పోర్టల్ తీసుకొస్తారు. లోన్ అవసరమైన స్టూడెంట్లు ఇందులో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.