పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ నూతన ఉత్తేజంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో విద్యావ్యవస్థకు సంబంధించిన పలు హామీలను ఇచ్చింది. అందులో ప్రధాన అంశం ఉన్నత విద్య అభివృద్ధి. గత పదేండ్ల పాలనలో ఉన్నత విద్యకు సంబంధించిన అభివృద్ధి పెద్దగా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యారంగంలో ప్రధానమైన డిగ్రీ విద్య నేడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. డిగ్రీలో ప్రవేశపెట్టిన కోర్సుల్లో నేటి మార్కెట్ అవసరాలకు అనుకూలంగా ఉన్న కోర్సులు లేదా సైన్స్ కోర్సుల్లోనే ఎక్కువగా విద్యార్థులు చేరుతున్నారు. మిగిలిన డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల నమోదు చాలా తక్కువగా ఉంటుంది. గత ప్రభుత్వం పదేండ్లలో అడ్మిషన్లు లేవని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న కోర్సులను, కొన్ని ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలను, యూనివర్సిటీల పీజీ సెంటర్లని కూడా పూర్తిగా మూసేసింది. దానివల్ల స్థానిక విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది ఏండ్లు దాటినా ప్రధానంగా కొన్ని డిగ్రీ కళాశాలలకు ఇంకా పూర్తిస్థాయి అధునాతన భవనాలు లేవు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ లాంటి ముఖ్యమైన మౌలిక వనరులు కూడా లేకపోవడం డిగ్రీ విద్యలో నెలకొన్న ప్రధాన సమస్యలు. బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ దగ్గరలో ఉన్న కళాశాలలకు తప్ప గ్రామీణ స్థాయిలో ఉన్న కళాశాలల అభివృద్ధికి ఎక్కువగా నిధులను కేటాయించలేదని విమర్శ కూడా ఉంది. కాలేజీల్లో విద్యార్థులకు సరిపడే కొత్త భవనాలను కట్టించలేదు. కొన్ని కోర్సులను ఆన్లైన్ విధానంలో ప్రవేశపెట్టినా అధ్యాపకులు లేకపోవడంతో వాటిలో జాయిన్ అయ్యేవారు కూడా లేరు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో ఉన్న అధ్యాపక ఖాళీలను కూడా భర్తీ చేయలేకపోవడం వల్ల అధ్యాపకుల కొరత కూడా తీవ్రమైంది.
విద్యార్థులకు ప్రశ్నించే స్వేచ్ఛనివ్వాలి
గత ప్రభుత్వం పరిమితికి మించి కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు పర్మిషన్ ఇచ్చింది. కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలను పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన జిల్లాలలో ప్రభుత్వం ఒక్క యూనివర్సిటీని కూడా నెలకొల్పలేకపోయింది. అదేవిధంగా రాబోయే ఆరు నెలల్లో ప్రస్తుతం ఉన్న ఉప కులపతుల పదవీకాలం కూడా ముగుస్తుంది. నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త ఉప కులపతులను ఎంపిక చేయాల్సిన అవసరం కూడా ఉంది. వర్సిటీల పాలక మండళ్లలోనూ కొత్తవారిని నియమిస్తే బాగుంటుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలకు స్వయంప్రతిపత్తి అనేది ముఖ్యమైన అంశం. దానికి విఘాతం కలవకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై రాజకీయ జోక్యం లేకుండా చూస్తే మరిన్ని గుణాత్మక ఫలితాలను ఆశించవచ్చు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు, నాయకులపై కేసులను పెట్టకుండా ప్రశ్నించే స్వేచ్ఛ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా డిగ్రీ, యూనివర్సిటీలలో పని చేస్తున్న అతిథి, ఒప్పంద అధ్యాపకుల వేతనాలని కూడా పెంచాల్సిన అవసరం ఉంది.
ఉపకార వేతనాల్లో అసమానత
సాంకేతిక విద్యకు సంబంధించి ఇంజినీరింగ్‌లో గణనీయంగా ప్రవేశాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధిక ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. మెడికల్ కళాశాలలు కొత్తవి ఏర్పాటు చేసినా వాటికి సంబంధించిన మౌలిక వనరులను కూడా ఏర్పాటు చేయాలి. ఉన్నత విద్యలో ప్రధానంగా ఉన్న సమస్య విద్యార్థులు అందరికీ ఉపకార వేతనాలు అందకపోవడం. కేవలం పది వేల ర్యాంకులోపు ఉన్నవారికి పూర్తి ఉపకార వేతనం ఇచ్చి, ర్యాంక్ నిబంధన పెట్టి పదివేల కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన విద్యార్థులకు కొంతవరకు ఉపకార వేతనం అందిస్తున్నారు. ముఖ్యంగా బీసీ విద్యార్థులు సాంకేతిక, వృత్తి విద్య కోర్సుల్లో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా విద్యార్థులకు డైట్ చార్జీలు, ఉపకార వేతనాలను కోర్సు ఫీజుకు అనుగుణంగా చెల్లించడంలేదు. దీంతో నిర్ణీత సమయంలో కోర్సులను పూర్తి చేసినా వారు సర్టిఫికెట్స్ తీసుకోలేకపోతున్నారు. డైట్ చార్జీలు, ఉపకార వేతనాలను కూడా కోర్స్ ట్యూషన్ ఫీజుకు అనుకూలంగా పెంచి క్రమం తప్పకుండా విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉన్నత విద్య చదువుతున్న ప్రతి విద్యార్థికి పూర్తి ఉపకార వేతనం ఇవ్వాలి. దీనివల్ల బహుజన విద్యార్థులు అధిక సంఖ్యలో లబ్ధి పొందుతారు.
యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన యూనివర్సిటీలను నేడు నిధుల సమస్య వెంటాడుతోంది. అధ్యాపక ఖాళీల కొరత విద్యార్థులను వేధిస్తోంది. పూర్తిస్థాయి రెగ్యులర్ సిబ్బంది లేక ఎక్కువ సంఖ్యలో తాత్కాలిక సిబ్బందితోనే యూనివర్సీటీలను పాలకవర్గాలు నెట్టుకొస్తున్నాయి. గత ప్రభుత్వం పదేండ్లు యూనివర్సిటీలను పెద్దగా పట్టించుకోలేదు, “తెలంగాణ మోడల్” గా చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను కూడా నియమించలేదు. ఇదే విధానం ఇకముందు కూడా కొనసాగితే వచ్చే ఐదేండ్లలో యూనివర్సిటీలకు లభించే జాతీయ గుర్తింపు కూడా పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రొఫెసర్లు అందరూ పదవీ విరమణ పొందుతున్నారు. ఈనేపథ్యంలో కొత్త అధ్యాపకులను నియమించలేకపోవడం వల్ల విద్యార్థులకు బోధనలో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని కాలయాపన చేసినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
విద్యారంగానికి బడ్జెట్ పెంచాలి
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నత విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు అనుకూలంగా డిగ్రీ విద్య, యూనివర్సిటీలలో మౌలిక వనరుల ఏర్పాటుకు ఎక్కువ నిధులను కేటాయించాలి. యూనివర్సిటీల్లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అన్ని అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అప్పుడే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి వై-ఫై సౌకర్యం కల్పించే ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యకు అర్హులైన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు స్లాట్స్ పెంచాలి. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన బడ్జెట్ శాతాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఖమ్మం, ఆదిలాబాద్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తే ఆ జిల్లాల విద్యార్థులకు ఉన్నత విద్య మరింత చేరువ అవుతుంది. విద్యారంగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, తరచూ సమీక్షలు చేసి మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ సర్కారు ఉన్నత విద్యను, ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేస్తుందని ఆశిద్దాం.
- డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల,
సోషల్ ఎనలిస్ట్