- అక్రమ నిర్మాణాలపై ముమ్మరం కానున్న తనిఖీలు
- ప్రతి వారం మున్సిపాలిటీలో సమీక్ష జరపనున్న టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ కమిటీలు
- విధులు, విధానాలపై ఆఫీసర్లతో సమావేశం
- గత ప్రభుత్వ హయాంలో నామ్కే వాస్తేగా పని చేసిన టాస్క్ ఫోర్స్ టీం
మహబూబ్‌నగర్, వెలుగు : అక్రమ నిర్మాణాలు, మున్సిపల్ స్థలాల ఆక్రమణలపై ఉన్నతాధికారులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కలెక్టర్ల ఆర్డర్లతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీల విధులు, విధానాలపై వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రీ యాక్టివ్ చేసేందుకు ఆర్డర్స్
రాష్ర్టంలో నవంబరు 16, 2020న టీజీ–బీపాస్ అందుబాటులోకి వచ్చింది. మున్సిపాల్టీ పరిధిలో కమర్షియల్, నాన్ కమర్షియల్ నిర్మాణాల కోసం టీఎస్–బీపాస్‌లో అప్లికేషన్ చేసుకుంటే 21 రోజుల్లో డాక్యుమెంట్ల వెరిషికేషన్ చేయడంతో పాటు సిబ్బంది ఫీల్డ్ విజిట్ చేసి పర్మిషన్లు ఇస్తారు. అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు అదే ఏడాది నుంచి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్, మున్సిపాల్టీ స్థాయిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేశారు. రూల్స్‌కు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే ఈ కమిటీలు వాటిపై ఉక్కుపాదం మోపుతాయి. ఫేక్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి నిర్మాణాలకు పర్మిషన్లు తీసుకుంటే వాటిని రద్దు చేస్తాయి. గత ప్రభుత్వం ఈ కమిటీలను ఏర్పాటు చేసి పక్కకు పెట్టేసింది.
కమిటీలు ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే సైలెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. ప్రభుత్వ, మున్సిపల్ స్థలాల ఆక్రమణలకు గురయ్యాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ కమిటీలను రీ యాక్టివ్ చేయాలని ఉన్నతాధికారులకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇటీవల ఉన్నతాధికారులు అన్ని మున్సిపార్టీల ఆఫీసర్లతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.
కమిటీల్లో ఉన్నతాధికారులు
టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ కమిటీలను పటిష్టంగా నియమించారు. ఈ కమిటీల్లో మున్సిపల్ కమిషనర్లు, ప్లానింగ్ విభాగం ఏసీపీ, టీపీవో, అర్బన్ మండలాల తహసీల్దార్లు, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్ కు చెందిన ఆఫీసర్లను నియమించనున్నారు. ఇటీవల ఈ డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లకు మున్సిపాల్టీల్లో సమావేశాలు జరిగాయి. వీరికి కమిటీల విధులు, విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
దీనిపై ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేశారు. ప్రతి వారం ఈ కమిటీలో సమావేశమవుతాయి. అలాగే మున్సిపాల్టీల్లో తనిఖీలు నిర్వహిస్తాయి. టీఎస్–బీపాస్ ద్వారా వచ్చిన అప్లికేషన్లను ఈ కమిటీలు పరిశీలన చేస్తాయి.
ఆన్‌లైన్‌లోకి ఎన్‌ఫోర్స్‌మెంట్
జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆన్‌లైన్ సిస్టం చేశారు. పోర్టల్, లాగిన్లు సపరేట్‌గా ఇచ్చారు. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ దీనికి హెడ్‌గా ఉంటారు. అప్లికేంట్ ఇబ్బంది లేకుండా ఇంటి నుంచే సిటిజన్ లాగిన్ నుంచి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, ఇతర విషయాలపై కంప్లైంట్ చేయొచ్చు. ఫిర్యాదులు తీసుకున్నాక విచారణ జరుపుతారు. విచారణలో తప్పులు తేలితే ముందుగా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పెనాల్టీలు, ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సి వస్తే.. ఆ బాధ్యతలను టాస్క్ ఫోర్స్ టీమ్‌కు అప్పగిస్తారు.