వడ్లు ఉన్నాయా? లేవా .. బయటపెట్టని సివిల్ సప్లై అధికారులు

  • యాదాద్రిలోని నాలుగు మిల్లుల్లో తనిఖీలు
  • టెండర్​ సహా మూడు సీజన్ల వడ్లూ మిల్లుల్లోనే
  • వీటి విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లు
  • హయ్యర్​ ఆఫీసర్లకు అందిన రిపోర్ట్!

కస్టమ్​ మిల్లింగ్ ​రైస్ (సీఎంఆర్) విషయాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. సీజన్ల మీద సీజన్లు గడుస్తున్నా.. బియ్యాన్ని పూర్తి స్థాయిలో మిల్లర్లు అప్పగించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తోంది. సూర్యాపేట జిల్లాలోని ఓ రైస్​మిల్లులో సీఎంఆర్​వడ్లు లేకపోవడంతో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎంఆర్ ​కోసం మిల్లర్లకు ఇచ్చిన వడ్లు అసలు​మిల్లుల్లో ఉన్నాయా? లేవా? అన్న దానిపై సివిల్ సప్లై​ డిపార్ట్​మెంట్ దృష్టి పెట్టింది.

యాదాద్రి, వెలుగు : యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ​వడ్లు మిల్లుల్లో నిల్వ ఉన్నాయి. ఇటీవల పలు మిల్లుల్లో తనిఖీలు చేసిన అధికారులు.. అక్కడ వడ్లు ఉన్నాయా లేవా? అన్నది బయటకు చెప్పలేదు. జిల్లాలో 2022–-23 యాసంగి సీజన్​లో 4,11,187 టన్నుల​ వడ్లను 41 మిల్లులకు సివిల్ సప్లై​డిపార్ట్​మెంట్​అప్పగించింది.

ఇందుకు 2,77,428 టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 50 శాతానికి పైగా అప్పగించారు. ఆ తర్వాత జిల్లాల్లోని మిల్లుల్లో ఉన్న వడ్లను విక్రయించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టెండర్లను పిలిచింది. మొత్తం1.88 లక్షల టన్నుల వడ్లను క్వింటాల్​కు రూ.2 వేల చొప్పున ఓ సంస్థ ఫిబ్రవరిలో టెండర్​దక్కించుకుంది. వడ్లను తీసుకున్న సదరు సంస్థ వాటిని తీసుకెళ్లడంలో కొంత జాప్యం చేస్తోంది. 

  •  2023 వానాకాలం సీజన్​కు 47 మిల్లులకు 2,65,197 టన్నుల వడ్లను సీఎంఆర్ ​కింద అప్పగించారు. వీటికి సంబంధించి 1.78 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉండగా, 50 శాతానికి పైగా అందజేశారు.
  •  2024 యాసంగి సీజన్​కు 3.37 లక్షల టన్నులు వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయగా, 2.70 టన్నుల వడ్లను మిల్లర్లకు అప్పగించింది. ఈ లెక్కన ఈ మూడు సీజన్లకు సంబంధించి రూ. వెయ్యి కోట్ల విలువైన  దాదాపు 5 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లోనే ఉన్నాయి. 

ఇతర జిల్లా ఆఫీసర్ల తనిఖీలు

సూర్యాపేట సహా పలు జిల్లాల్లోని రైస్​మిల్లుల్లో ఇటీవల సివిల్​సప్లై​అధికారులు తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఓ మిల్లులో సీఎంఆర్​ వడ్ల స్టాక్​లేదని తేలడంతో కేసు నమోదైంది. దీంతో తరచూ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలోని రామన్నపేట, ఆలేరులోని ఒక్కో మిల్లు, భూదాన్​ పోచంపల్లి మండలంలోని రెండు రైస్​ మిల్లులకు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఆఫీసర్లు వచ్చారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసు, రెవెన్యూ డిపార్ట్​మెంట్ ఆఫీసర్లను వెంట తీసుకొని మిల్లుల్లోకి వెళ్లారు. మొత్తం మూడు సీజన్లకు సంబంధించి మిల్లుల్లో ఎంత స్టాక్ ఉండాలో​ వివరాలను తీసుకొని శనివారం నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఒక్కో మిల్లులో ఉదయం నుంచి రాత్రి వరకూ వడ్ల బస్తాలను లెక్కించారు.

అయితే, సివిల్​ సప్లయ్​ ఆఫీసర్లు తనిఖీ చేసిన ఆ నాలుగు మిల్లుల్లో సీఎంఆర్​ కోసం కేటాయించిన వడ్లు ఉన్నాయా..? లేవా..? అన్నది అధికారులు ఇంకా బయటపెట్టలేదు. తనిఖీ చేసిన ఆఫీసర్లు ఈ మూడు సీజన్లకు సంబంధించిన వడ్ల స్టాక్​పై రిపోర్ట్​ రూపొందించారు. అయితే, తాము మిల్లుల్లో వడ్ల స్టాక్​ తనిఖీలు చేసిన సమాచారాన్ని అందించిన ఆఫీసర్లు స్టాక్ వివరాలతో కూడిన రిపోర్ట్​ను మాత్రం జిల్లా ఆఫీసర్లకు అందించలేదు. హైదరాబాద్​లోని హయ్యర్​ ఆఫీసర్లకు ఈ రిపోర్ట్​ అందించినట్టుగా తెలుస్తోంది.