మంచిర్యాల, వెలుగు:సివిల్ సప్లయి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు రైస్‌మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) ఎగవేసిన మిల్లర్లపై యాక్షన్ తీసుకోవడం అటుంచి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత రెండు సీజన్లకు సంబంధించి ఎఫ్‌సీఐకి పెండింగ్ ఉన్న సీఎమ్మార్‌ను మిల్లర్ల ఒత్తిడి మేరకు సివిల్ స ప్లై కి కన్వర్షన్ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ వ్యవహారంలో కమిషనరేట్ స్థాయిలో లక్షల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎఫ్‌సీఐలో పాస్ కావట్లే...
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల దగ్గరి నుంచి సేకరించిన వడ్లను రైస్‌మిల్లర్లకు ఇస్తుంది. వాటిని మిల్లింగ్ చేసి క్వింటాల్ వడ్లకు 68 కిలోల బియ్యాన్ని అప్పగించాల్సి ఉంటుంది. ఇందులో మెజారిటీ వాటా ఎఫ్‌సీఐకి కేటాయించగా, మిగతాది సివిల్ సప్లై కి అందజేయాలి. రైస్ క్వాలిటీ విషయంలో ఎఫ్‌సీఐ రూల్స్ స్ర్టిక్ట్‌గా ఫాలో అవుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత పాటిస్తేనే బియ్యాన్ని తీసుకుంటుంది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. కానీ మిల్లర్లు ఈ ప్రమాణాల ప్రకారం సీఎమ్మార్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొంతమంది మిల్లర్లు వడ్లను మిల్లింగ్ చేసి ఓపెన్ మార్కెట్‌కు తరలించారు. కిలో రూ.30 నుంచి రూ.35కు అమ్ముకున్నారు. మరికొందరు ఏకంగా వడ్లనే అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. మిగతా వడ్లను చాలారోజులు ఆరుబయట నిల్వ ఉంచడం వల్ల వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతున్నాయి. సహజంగానే యాసంగి వడ్లలో నూకశాతం ఎక్కువ వస్తుందంటే వడ్లు పాడవడంతో మరింత నాసిరకం బియ్యం వస్తున్నాయి. ఎఫ్‌సీఐ 25 శాతం నూకలను అనుమతించినప్పటికీ అంతకంటే ఎక్కువే వస్తున్నాయి. అంతేగాకుండా బియ్యం రంగు మారుతున్నాయి. ఏసీకేలు పంపిన తర్వాత క్వాలిటీ లేదని రిజెక్ట్ చేస్తే ఒక్కో లారీకి ట్రాన్స్పోర్ట్, హమాలీ చార్జీలు రూ.40వేల నుంచి రూ.50వేలు లాస్ వస్తుందని అంటున్నారు. దీంతో ఎఫ్‌సీఐకి సీఎమ్మార్ పెట్టేందుకు మొండికేస్తున్నారు.
కన్వర్షన్ కోసం పైసలు, పైరవీలు...
రైస్‌మిల్లర్లు ఎఫ్‌సీఐకి భారీగా సీఎమ్మార్ పెండింగ్ ఉన్నప్పటికీ సివిల్ సప్లయి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఏండ్లుగా సీఎమ్మార్ ఇవ్వకున్నా ఎప్పటికప్పుడు డెడ్లైన్లు పొడిగించడం తప్ప ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం మిల్లర్లకు అలుసుగా మారింది. జిల్లాలో 2021–22 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి ఎఫ్‌సీఐకి 37 వేల మెట్రిక్ టన్నుల సీఎమ్మార్ పెండింగ్ ఉంది. దీనిని ఈ నెలాఖరులోపు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మిల్లర్ల సంఘం లీడర్లు రంగంలోకి దిగారు. ప్రభుత్వంలోని కీలక నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎఫ్‌సీఐకి పెండింగ్ ఉన్న సీఎమ్మార్‌ను సివిల్ సప్లయి కార్పొరేషన్‌కు కన్వర్ట్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు తీసుకొచ్చారు. జిల్లాలో 37వేల మెట్రిక్ టన్నులకు గాను 26వేల మెట్రిక్ టన్నులకు పర్మిషన్ వచ్చింది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మిగతా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కన్వర్షన్‌కు పర్మిషన్ తీసుకొచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
రేషన్ బియ్యం రీసైక్లింగ్...
జిల్లాలోని కొందరు మిల్లర్లు వడ్లను మిల్లింగ్ చేసి బియ్యాన్ని బయట అమ్ముకోగా, మరికొందరు వడ్లనే మాయం చేశారు. అలాంటివారు సీఎమ్మార్ లోటును పూడ్చుకునేందుకు రేషన్ బియ్యం రీసైక్లింగ్‌పై ఆధారపడ్డారు. రేషన్ డీలర్లు, దళారుల దగ్గర కిలో రూ.20 నుంచి రూ.25కు కొని సివిల్ సప్లయికి అంటగడుతున్నారు. ఆ డిపార్ట్మెంట్ అధికారుల అండతో రీసైక్లింగ్ దందా విచ్చలవిడిగా సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై మీడియాలో వరుస కథనాలు రావడంతో క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు స్పందించారు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు జిల్లాలోని గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బియ్యం క్వాలిటీ పై అనుమానాలు ఉండడంతో టెస్టింగ్ కోసం శాంపిల్స్ తీసుకెళ్లినట్టు సమాచారం.