మల్కాజిగిరిలో అత్యధికంగా 178 రౌండ్ల కౌంటింగ్

మల్కాజిగిరిలో అత్యధికంగా 178 రౌండ్ల కౌంటింగ్
  • రాష్ట్రంలో ఆఖరున తేలనున్న ఫలితం
  • గ్రేటర్ పరిధిలో ఫస్ట్​ రిజల్ట్​  వచ్చేది  లష్కర్​లోనే..
  • హైదరాబాద్​లో 142, సికింద్రాబాద్​లో 125 రౌండ్ల కౌంటింగ్
  •  హైదరాబాద్, సికింద్రాబాద్ సెగ్మెంట్లకు సంబంధించి 13 చోట్ల లెక్కింపు 
  • చేవెళ్ల బండారి శ్రీనివాస్ కాలేజీలో  చేవెళ్ల నియోజకవర్గ కౌంటింగ్ 
  • కీసర, ఎల్బీనగర్, సికింద్రాబాద్​ఏరియాల్లో మల్కాజిగిరి ఓట్ల లెక్కింపు
  • సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో కంటోన్మెంట్ బైపోల్ కౌంటింగ్

హైదరాబాద్/ఎల్బీనగర్/మేడ్చల్/చేవెళ్ల, వెలుగు : గ్రేటర్ సిటీ పరిధిలోని నాలుగు లోక్​సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్​సభ స్థానాలతోపాటు, కంటోన్మెంట్​ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదటగా సికింద్రాబాద్ ఫలితం తేలనుంది. ఆ తర్వాత హైదరాబాద్, చేవెళ్ల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

రాష్ట్రంలోనే అత్యధిక రౌండ్లు ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గ ఫలితం చిట్టచివరన రానుంది. కౌంటింగ్ సిబ్బంది అబ్జర్వర్ల సమక్షంలో సోమవారం రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఖరారైన జాబితాను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్న మైక్రో అబ్జర్వర్లకు ఇప్పటికే ఓట్ల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు.

7 చోట్ల హైదరాబాద్​ కౌంటింగ్

హైదరాబాద్ లోక్​సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను ఏడు చోట్ల, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రెండు చోట్ల లెక్కించనున్నారు. హైదరాబాద్​స్థానం పరిధిలో మొత్తం 1,944 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అధికారులు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్, పోస్టల్ బ్యాలెట్ కోసం 7 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 142 రౌండ్లలో ఫలితాలు తేలనున్నాయి.

అత్యధికంగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో 23 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. అత్యల్పంగా చార్మినార్ లో 15 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. కంటోన్మెంట్ బై ఎలెక్షన్​కు సంబంధించిన కౌంటింగ్ సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో జరగనుంది. 

సికింద్రాబాద్ లోనూ.. 

సికింద్రాబాద్ లోక్​సభ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కూడా ఏడు చోట్ల ఓట్లను లెక్కించనున్నారు. ఇక్కడ మొత్తం 1,810 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్​లో అత్యధికంగా 20 టేబుల్స్ ఏర్పాటు చేయగా, మిగిలిన ఆరు చోట్ల14 టేబుల్స్ ని ఏర్పాటు చేశారు. లష్కర్​ఫలితం 125 రౌండ్లలో తేలనుంది. అత్యధికంగా ముషీరాబాద్, నాంపల్లి అసెంబ్లీ స్థానాల పరిధిలో 20 రౌండ్లు, అత్యల్పంగా సికింద్రాబాద్​లో 16 రౌండ్ల  కౌంటింగ్ జరగనుంది. 

మూడు చోట్ల మల్కాజిగిరి లెక్కింపు

మల్కాజిగిరి లోక్​సభ స్థానం పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్​పల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఈవీఎంలను కీసరలోని హోలీమేరీ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్కించున్నారు. కంటోన్మెంట్​అసెంబ్లీ స్థానం పరిధిలోని ఈవీఎంలను సికింద్రాబాద్ వెస్లీ కాలేజీలో, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఈవీఎంలను సరూర్​నగర్​ఇండోర్​స్టేడియంలో లెక్కించనున్నారు. మొత్తంగా మల్కాజిగిరి లోక్​సభ స్థానం పరిధిలో 2,425 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుల్స్, కంటోన్మెంట్ కు14 టేబుల్స్, మిగిలిన మూడు చోట్ల 20 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం 20 టేబుల్స్ ను సపరేట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం 178 రౌండ్లలో మల్కాజిగిరి నియోజకవర్గ లెక్కింపు పూర్తి కానుంది. అత్యధికంగా మేడ్చల్ అసెంబ్లీ స్థానం పరిధిలో 28 రౌండ్లు, అత్యల్పంగా కంటోన్మెంట్ లో 14 రౌండ్ల కౌంటింగ్ జరగనుంది. 

చేవెళ్లలో ఒకేచోట.. 

చేవేళ్ల లోక్​సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో జరగనుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడే లెక్కించనున్నారు. చేవెళ్ల పరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరలింగంపల్లి నియోజకవర్గాలకి సంబంధించి 28 టేబుల్స్, మిగిలిన నాలుగు స్థానాల కు సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రత్యేకంగా 25 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 165 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 23 రౌండ్లు, అత్యల్పంగా తాండూరులో 16 రౌండ్ల కౌంటింగ్​జరగనుంది.