ఫాంహౌస్​లలో హై ఫై పార్టీలు..మందు, డ్రగ్స్, అమ్మాయిలతో ఎర

ఫాంహౌస్​లలో హై ఫై పార్టీలు..మందు, డ్రగ్స్, అమ్మాయిలతో ఎర
  • ‘ముజ్రా’, ముఖా పేర్లతోనూ పార్టీలు
  • బ్యాచిలర్స్, రిచ్​కిడ్స్, సాఫ్ట్​వేర్ ​ఎంప్లాయీస్​కు ఇన్విటేషన్ 
  • కోడిపందాలు, బెట్టింగ్​లు కూడా..  సిటీ శివారులో పెచ్చుమీరుతున్న కల్చర్​ 

హైదరాబాద్​సిటీ, వెలుగు:వీకెండ్​ వచ్చిందంటే చాలు నగర శివార్లలోని ఫామ్ హౌజ్​లలో ఇల్లీగల్​ పార్టీలు పెరిగిపోతున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, శంకర్​పల్లి వైపు సుమారు 3 వేల ఫామ్ హౌస్​లు ఉండడంతో ఈ కల్చర్ ​ఇక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. రోజుల వారీగా ఫాంహౌస్​లను ఆఫర్లతో రెంట్​కు ఇస్తుండడం, పర్యవేక్షించే వారు లేకపోవడం, 100 శాతం ప్రైవసీకి ఓనర్లు గ్యారంటీ ఇస్తుండడంతో లిక్కర్, స్టెరాయిడ్స్, డ్రగ్స్​తో ఓపెన్​గానే పార్టీలు చేసుకుంటున్నారు. 

ఇక్కడితో ఆగకుండా అమ్మాయిలను కూడా తీసుకువచ్చి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయిస్తున్నారు. కొంతమంది నిర్వాహకులు ఫాంహౌస్​లలో స్పెషల్​పార్టీలు అరేంజ్​ చేస్తున్నారు. నార్త్​తో పాటు రష్యా అమ్మాయిలు వస్తారంటూ ఆశ చూపి యూత్​ను అట్రాక్ట్​చేస్తున్నారు. వారి నుంచి వేలల్లో వసూలు చేసి పార్టీలకు డ్రగ్స్​ కూడా సప్లై చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొన్ని చోట్ల అయితే కోడి పందాలు, బెట్టింగ్, క్యాసినో లాంటివి కూడా కామన్​ అయిపోయాయి. సిటీ శివార్లలోని ఏదో ఫాంహౌస్​లో రోజూ ఏదో చోట ఇలాంటి ఇల్లీగల్​పార్టీలు కొనసాగుతూనే ఉన్నా పోలీసులు దాడులు చేస్తే తప్ప బయటపడడం లేదు.  

పేర్లు మాత్రమే వేరు..​

వీకెండ్​ వస్తే చాలు సిటీ నుంచి చాలామంది యూత్, ఫ్యామిలీస్​ ఫాంహౌస్​లు, రిసార్ట్స్​కు వెళ్లి చిల్​అవుతూ ఉంటారు. ఈ కల్చర్​ ఇప్పుడు సిటీలో బాగా పెరిగిపోయింది. అయితే, కొందరు నిర్వాహకులు ఫామ్​ హౌజ్​లలో స్పెషల్​ పార్టీలు ప్లాన్​ చేసి బ్యాచిలర్స్, రిచ్​కిడ్స్, ఎగువ మధ్యతరగతి, ఉన్నత తరగతులకు చెందిన వారితో పాటు పెద్ద పెద్ద వ్యాపారులను ఇన్విటేషన్​పంపుతున్నారు. 

హైదరాబాద్​ నుంచే కాకుండా కర్నాటక,  చెన్నై నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారు. ఆయా నగరాల నుంచి ఎప్పుడూ వచ్చేవారిని ఒక గ్రూప్​గా క్రియేట్​ చేసి  స్పెషల్​ ప్యాకేజీలు ఇస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లను టార్గెట్​ చేస్తున్నారు. వీరికి రెంట్ ఈవెంట్ ను బట్టి మినిమం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకుంటున్నారు. ఇంకొందరు ముఖా పార్టీ, ముజ్రా పార్టీ అని పేర్లు పెట్టి మరీ నైట్​పార్టీలు చేస్తున్నారు. 

అమ్మాయిలు, డ్రగ్స్​ మస్ట్​

అమ్మాయిలు, డ్రగ్స్​ లేకుండా అస్సలు ఏ పార్టీ జరగడం లేదు. హైదరాబాద్ నుంచే కాకుండా ఏపీలోని గోదావరి జిల్లాలు, వైజాగ్, పశ్చిమ బెంగాల్,  రాజస్థాన్ , ఢిల్లీ, ముంబై లాంటి ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తున్నారు. వారితో పార్టీల్లో నగ్నంగా, అర్ధ నగ్నంగా డ్యాన్సులు చేయిస్తున్నారు. పార్టీకి వచ్చిన వారికి కిక్​రావడం కోసం కొకైన్, హెరాయిన్, ఎల్​ఎస్​డీ బ్లాస్ట్స్​తో పాటు గాంజా, హ్యాష్​ఆయిల్ వంటి లోకల్​మేడ్​డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. ఇక్కడ అలవాటు చేయించి డార్క్​వెబ్​ ద్వారా సేల్స్​ కూడా చేస్కుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

డీజే.. డ్రగ్స్​

ఫామ్​ హౌజ్​లలో నిర్వహిస్తున్న ఈవెంట్లలో డీజేలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా డీజేలను తీసుకువస్తున్నారు. ఈ డీజేల్లో కొందరు  పార్టీకి కావాల్సిన మాల్​(డ్రగ్స్​) తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.  

తోల్​కట్టలో కోడి పందాలు 

మొయినాబాద్ పరిధిలో బెట్టింగ్, క్యాసినో​కూడా కామన్​అయిపోయాయి. కొన్ని నెలల కింద తోల్​కట్టలోని ఓ ఫామ్​హౌస్ లో పోలీసులు దాడులు నిర్వహించగా, కోడి పందేలు నిర్వహిస్తున్నట్టు తేలింది. బెట్టింగ్​, క్యాసినో ఫెసిలిటీ కూడా ఉందని తెలుసుకుని అవాక్కయ్యారు. ఇక్కడ సుమారు రూ.33 లక్షలు, 55 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఎస్ఓటీ పోలీసులు కొన్ని ఫామ్ హౌస్ లపై దాడులు చేసి గాంజా, అమ్మాయిలతో పార్టీ చేస్కుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.  

ఎతుబార్పల్లిలో ముజ్రా 

మొయినాబాద్ మండల పరిధిలోని ఎతుబార్పల్లి రెవెన్యూ పరిధిలోని ఓ ఫాంహౌస్​లో మంగళవారం నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బర్త్ డే సెలబ్రేషన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ముజ్రా పార్టీ ఏర్పాటు చేసి 8 మంది అమ్మాయిలను తీసుకువచ్చారు. 

యువతులకు మద్యం, గంజాయి మత్తెక్కించి అర్ధనగ్నంగా అశ్లీల నృత్యాలు చేయించారు.  ఈ పార్టీలో మద్యంతో పాటు గంజాయి, నిరోధ్​ ప్యాకెట్లు సీజ్​ చేశారు.  గతంలో కూడా చేవెళ్ల పరిధిలోని ఎడ్లపల్లి శివారులోని ఓ ఫామ్ హౌస్​లో ముజ్రా పార్టీ  నిర్వహిస్తుండగా అప్పటి  ఏసీపీ రైడ్​ చేసి నిర్వాహకులతో పాటు పాల్గొన్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.