గురుకులాలపై ఉన్నతస్థాయి సమీక్ష జరపాలి

  • సీఎంకు ఆర్. కృష్ణయ్య లెటర్

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపి, సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య లేఖ రాశారు. ఈ విద్యా సంవత్సరంలో 42 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 1200 మంది విద్యార్థులు అనారోగ్యంతో ఆసుపత్రిల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని రాజకీయ కోణంలో చూడకుండా అభివృద్ధి సంస్కరణ కోణంలో చూడాలని సూచించారు. 

రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల ఫుడ్ పాయిజన్ పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుందన్నారు. పాలనా విధానంలో ఉన్న లోపాలు సవరించవలసిన అవసరం ఉందని తెలిపారు. కొందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నందున ఆహారంలో క్వాలిటీ పడిపోతుందని ఆరోపించారు. కాంట్రాక్టర్లు కోఆర్డినేటర్లు కుమ్మక్కై కాలం చెల్లిన నిత్యవసర వస్తువులను భోజనం తయారీకి ఉపయోగిస్తున్నారని తెలిపారు. బీసీ హాస్టళ్లల్లో విద్యార్థుల చదువు, విద్యా ప్రమాణాలను పెంచవలసిన అవసరం ఉందన్నారు. తమ విజ్ఞప్తిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య లేఖ ద్వారా రిక్వెస్ట్ చేశారు.