మెదక్ సిద్ధిపేట హన్మకొండ జిల్లాలను కలుపుతూ హైవే

మెదక్/సిద్దిపేట, వెలుగు: రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు జిల్లాలను కలుపుతూ కొత్త నేషనల్ హైవే నిర్మాణం జరుగనుంది. మెదక్ జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రం మీదుగా హన్మంకొండ  జిల్లా ఎల్కతుర్తి వరకు 134 కిలో మీటర్ల దూరం నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,461 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి ఇదివరకే డీపీఆర్ రెడీ కావడంతో పాటు, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా వచ్చింది. కాగా శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్చువల్ గా ఈ కొత్త హైవే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ హైవే వల్ల మూడు జిల్లాలకు అనుసంధానం పెరగడంతో పాటు, సింగిల్ రోడ్డుతో వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందులు దూరం కానున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధికి బాటలు పడనున్నాయి. 

గ్రామాల వద్ద ఫోర్ ​లేన్ రోడ్డు

మెదక్ నుంచి సిద్దిపేట వరకు రూ.882.18 కోట్లతో 69.97 కిలోమీటర్ల దూరం పేవుడ్​ షోల్డర్స్​తో రెండు వరుసల హైవే రోడ్డు నిర్మాణం జరుగనుంది. ఇందులో మెదక్ జిల్లాలో 33.676 కిలోమీటర్లు, సిద్దిపేటలో 36.302 కిలోమీటర్ల దూరం హైవే వెళ్లే గ్రామాల దగ్గర ఫోర్​ లేన్ రోడ్ నిర్మించడంతో పాటు, డివైడర్ మధ్యలో స్ట్రీట్ లైట్స్, రెండు వైపులా రేలింగ్, సైడ్ డ్రైన్లు, ఫుట్ పాత్ లు నిర్మిస్తారు. సిద్దిపేట జిల్లాలో పోతిరెడ్డిపేట్, అక్బర్ పేట్, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి గ్రామాలతో పాటు సిద్దిపేట పట్టణ పరిధిలో, మెదక్ జిల్లాలో మెదక్ టౌన్, పాతూరు, అక్కన్నపేట్, రామాయంపేట్, కోనాపూర్, నందిగామ, నిజాంపేట్ గ్రామాల వద్ద ఫోర్ ​లేన్ ​రోడ్డు నిర్మించనున్నారు. 

అండర్ పాస్.. ఓవర్ పాస్ లు

సిద్దిపేట టౌన్ లో ఎన్సాన్ పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు వరుసల రోడ్డుతో పాటు రెండు వైపులా స్థానిక ప్రజల సౌకర్యార్థం సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేస్తారు. ఎన్సాన్ పల్లి సర్కిల్ వద్ద వెహికల్ అండర్ పాస్, సిద్దిపేటలో హైదరాబాద్ - కరీంనగర్ - రామగుండం రోడ్ వద్ద వెహికల్ ఓవర్ పాస్ నిర్మించనున్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట ఎన్ హెచ్ 44ను క్రాస్ చేసేందుకు వెహి కల్ అండర్ పాస్,  రామాయంపేట టౌన్​ శివారులోని గజ్వేల్​ రోడ్డులో మరో వెహికల్ అండర్ పాస్ నిర్మించేలా ప్లాన్ చేశారు. మెదక్ జిల్లా అక్కన్నపేట్ వద్ద రైల్వే ట్రాక్ ఉండటంతో అక్కడ వెహికల్స్​ రాకపోకలకు వీలుగా రైల్ అండర్ బ్రిడ్జి నిర్మించనున్నారు.  కాగా, ఈ హైవే రోడ్ నిర్మాణంతో సిద్దిపేట జిల్లాలో నాలుగు మేజర్ జంక్షన్లు, 19 మైనర్ జంక్షన్లు, మెదక్ జిల్లాలో 4 మేజర్ జంక్షన్లు, 15 మైనర్ జంక్షన్లు అభివృద్ధి కానున్నట్లు ఆర్ అండ్ బీ  అధికారులు తెలిపారు.

45.07 హెక్టార్ల భూసేకరణ

నేషనల్ హైవే రోడ్డు నిర్మాణ  పనుల కోసం మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు కాగా అందులో 9.35 హెక్టార్ల అటవీ భూమి సేకరించాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది. కొత్తగా మంజూరైన హైవే రోడ్డు నిర్మాణానికి ఇదివరకే సర్వే జరుగగా, ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడంతో త్వరలోనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ హైవే పూర్తయితే మెదక్, సిద్దిపేట జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది.