- మెదక్ నుంచి ఎల్లారెడ్డి , బాన్సువాడ మీదుగా రుద్రూరు వరకు నిర్మాణం
- రూ. 899 కోట్లతో... 98.2 కి.మీ.
- మరింత మెరుగుకానున్న రవాణా సౌకర్యం
కామారెడ్డి , వెలుగు : కామారెడ్డి జిల్లా మీదుగా మరో హైవే నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే జిల్లా నుంచి హైదరాబాద్ నుంచి నాగ్పూర్, సంగారెడ్డి నుంచి నాందేడ్, అకోల హైవే ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు మరో హైవే నిర్మాణం చేపట్టారు. రూ.899 కోట్లతో ఈ పనులు చేపట్టగా.. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాతో పాటు మహారాష్ర్ట ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుకానుంది.
హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా నర్సాపూర్, మెదక్, కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ మీదుగా నిజామాబాద్ వైపు ఉన్న స్టేట్ హైవేను కేంద్ర ప్రభుత్వం గతంలోనే నేషనల్ హైవేగా గుర్తించింది. ఎన్హెచ్765 డి నంబర్ కేటాయించింది. మొదటి విడతలో ఇది వరకే హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు హైవే నిర్మాణం పూర్తయింది. ఇక్కడి నుంచి కొనసాగింపుగా మెదక్ జిల్లా కేంద్రం నుంచి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ వరకు 98.2 కి.మీ. మేర నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులను 2 ప్యాకేజీలుగా విభజించారు.
టెండర్ల ప్రక్రియ కంప్లీట్ కావటంతో 2 వైపుల నుంచి పనులు ఇటీవల ప్రారంభించారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డికి 43.9 కి.మీ.కు రూ.399 కోట్లు, ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్కు 54.3 కి.మీ. రూ.500 కోట్ల తో వర్క్స్ జరుగుతున్నాయి. హైవే పనులకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో 90 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే చాలా వరకు భూ సేకరణ జరగ్గాభూమి కోల్పోతున్న వారికి నిజామాబాద్ జిల్లాలో పరిహారం కూడా చెల్లించారు.
కామారెడ్డి జిల్లాకు సంబంధించి సేకరణ చివరి దశలో ఉంది. ఎల్లారె డ్డి నుంచి రుద్రూర్ వరకు ఫారెస్టు ఏరియా గుండా 10. 4 కి.మీ. హైవే వెళ్లనుంది. ఫారెస్టు క్లియరెన్స్ కోసం ఇప్పటికే కేంద్ర అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్వెళ్లాయి. కొద్ది రోజుల్లోనే పర్మిషన్ రానుంది.
పనులు ఎక్కడ ప్రారంభించారంటే..
ఒక ప్యాకేజీకి సంబంధించి నాగిరెడ్డిపేట మండల కేంద్రం నుంచి ఎల్లారెడ్డి వైపు పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు కోసం తవ్వకాలు, చెట్ల తొలగింపు జరుగుతుంది. సెకండ్ ప్యాకేజీకి సంబంధించి నిజాంసాగర్ మండలం బొగ్గు గుడిసె నుంచి బాన్సువాడ వైపు పనులు స్టార్ట్ అయ్యాయి. 10 రోజులుగా పనులు చేస్తున్నారు. హైవే నిర్మాణ పనులు 2 ఏండ్లలో అంటే 2026 జులై వరకు కంప్లీట్ కావాలి.
అంతకంటే ముందే వర్క్స్ కంప్లీట్ చేయటానికి ప్రయత్నిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. స్టేట్ హైవేలుగా ఉన్న వాటిని నేషనల్ హైవేగా గుర్తించి వర్క్స్ చేస్తున్నారు. మూల మలుపులు తగ్గించి డబుల్ రోడ్డు నిర్మాణం చేస్తారు. గ్రామాల దగ్గర మాత్రం 4 లైన్లతో నిర్మించి అటు ఇటు సర్వీసు రోడ్లు, లైటింగ్, డ్రైనేజీ నిర్మాణం చేస్తారు.
కరీంనగర్ నుంచి పిట్లం వరకు
కరీంనగర్ నుంచి కామారెడ్డి మీదుగా ఎల్లారెడ్డి వరకు ( కె.కె.వై.) స్టేట్ హైవే ఉంది. దీన్ని నేషనల్ హైవేగా గుర్తించాలని గతంలోనే రాష్ర్ట ప్రభుత్వం కోరింది. డీపీఆర్ కూడా రెడీ చేశారు. ఎల్లారెడ్డి నుంచి పిట్లం వరకు హైవేగా గుర్తించాలని కోరారు. సంగారెడ్డి నుంచి అకోలా వెళ్లే నేషనల్ హైవే ఇది వరకే నిర్మాణం జరిగింది. కరీంనగర్ నుంచి వచ్చే రోడ్డును కూడా ఈ హైవేకు కనెక్టివిటీ కానుంది. కె.కె.వై. రోడ్డును ఇంకా హైవేగా గుర్తించలేదు. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి హైవేలుగా గుర్తించాలని విన్నవించిన రోడ్లలో ఇది కూడా ఉంది.