- నిర్మల్ కేంద్రంగా 4 రాష్ట్రాలకు రోడ్ల లింకేజీ..
- రాష్ట్రంలో 5 జిల్లాలతో అనుసంధానం
- మెరుగు పడనున్న రవాణా రంగం
- విస్తరించనున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంగా హైవే కారిడార్ ఏర్పడబోతోంది. ఈ కారిడార్ 4 రాష్ట్రాలకు లింకేజీగా మారనుంది. రాష్ట్రంలోని నిర్మల్ తో పాటు మరో 4 జిల్లా లకు అనుసంధానం కానుంది.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు నేషనల్ హైవే నెంబర్ 44 కొనసాగుతుండగా.. కొంతకాలం క్రితమే మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి భైంసా మీదుగా నిర్మల్ వరకు నేషనల్ హైవే నంబర్ 61 ప్రారంభమైంది.
ఈ రెండు హైవేలతో మహారాష్ట్రకు లింకేజీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ రెండు హైవేలు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి. కాగా దీనికి మరో హైవేను లింక్ చేస్తూ నేషనల్ హైవే శాఖ(ఆర్అండ్బీ) నిర్మల్ నుంచి ఖానాపూర్ మీదుగా జగిత్యాల వరకు జాతీయ రహదారిని నిర్మిస్తోంది.
ప్రస్తుతం నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు రోడ్డు పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ.140 కోట్లతో పనులు చేపట్టారు. ఈ రోడ్డు కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండడంతో వన్యప్రాణుల సంరక్షణ కోసం రూ.40 కోట్ల వ్యయంతో 7 చోట్ల అండర్ పాసుల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
నాలుగు రాష్ట్రాలకు కనెక్టివిటీ..
నిర్మల్ జిల్లా మీదుగా ఇప్పటికే నేషనల్ హైవే నంబర్ 44 కొనసాగుతోంది. దీంతో నిర్మల్‌తో పాటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు మహారాష్ట్రతో లింకేజీ ఏర్పడింది.
అలాగే నేషనల్ హైవే నంబర్ 61లో భాగంగా మహారాష్ట్రలోని కల్యాణ్ నుంచి నిర్మల్ వరకు రోడ్డు ఏర్పడడంతో నిజామాబాద్, నిర్మల్ జిల్లాలు అనుసం ధానమయ్యాయి.
నిజామాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ వరకు నేషనల్ హైవే 63 రహదారి ఉన్నందున ఈ రోడ్డుకు నిర్మల్, జగిత్యాల హైవే లింకేజీ కాబోతోంది. అలాగే బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా వరకు నిర్మిస్తున్న 161 బీబీ హైవే రోడ్డుతో కర్ణాటక రాష్ట్రానికి లింకేజీ ఏర్పడనుంది.
ఈ హైవే హైదరాబాద్ నుంచి మద్దునూరు వెళ్లే రోడ్డుకు కనెక్ట్ కానునట్లు అధికా రులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా ఈ హైవే కారణంగా కనెక్టివిటీ ఉంటుందని పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ 4 హైవేలతో 4 రాష్ట్రాలకు కనెక్టివిటీ ఏర్పడనుంది.
వ్యాపారం, వాణిజ్యానికి ఊతం
కాగా నాలుగు హైవేలు నాలుగు రాష్ట్రాలను కనెక్టివిటీ చేయనున్న నేపథ్యంలో వీటి పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో వ్యాపార, వాణిజ్య రంగాలు మరింత విస్తరించే అవకాశాలున్నాయి.
ర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో వ్యాపార కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది.
ఇప్పటికే కల్యాణ్–నిర్మల్ హైవే కారణంగా నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వ్యాపారులు నాందేడ్ తో పాటు జాల్నా, పర్బనీ, ఔరంగాబాద్, ముంబయి లాంటి నగరాలకు వెళ్లి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు.
అలాగే హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు ఉన్న నేషనల్ హైవే 44తో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు విస్తరించాయి. మరో రెండు హైవేల పనులు కొద్ది రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.