- ఇంట్లో మంచి జరగలేదని నిలదీసిన బాధితురాలు
- గురువు వద్దకు కేరళ వెళ్లి వస్తానని పరారైన హిజ్రా
- జనగామ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా తెలిసిన ఘటన
జనగామ అర్బన్, వెలుగు : శాంతిపూజల పేరిట ఓ హిజ్రా రూ. 55 లక్షలు కొట్టేసిన ఘటన జనగామ జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ టౌన్ వెంకన్నకుంటకు చెందిన ఉప్పల సిరివెన్నెల తన ఇంట్లో కలిసిరావడంలేదని, సమస్యలు వస్తున్నాయని.. పోశమ్మ టెంపుల్వద్ద ఉండే ఫ్రెండ్ నిరోషాకు చెప్పుకుని బాధపడింది. దీంతో నిరోషా తనకు తెలిసిన ఓ హిజ్రా పూజలు చేస్తే మంచి జరుగుతుందని తెలిపింది.
నమ్మిన సిరివెన్నెల భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన హిజ్రా నాగదేవిని ఆశ్రయించగా ముందుగా రూ.13 లక్షలు తీసుకుని పూజలు చేసింది. ఆ తర్వాత పలు దఫాలుగా పూజలు చేసి రూ. 55 లక్షల వరకు వసూలు చేసింది. సిరివెన్నెల అప్పులు చేసి మరి డబ్బులు తెచ్చి ఇచ్చింది. అయినా ఇంట్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.
దీంతో ఈనెల13న నాగదేవిని బాధితురాలు నిలదీయడంతో తన గురువు వద్దకు కేరళ వెళ్లి వస్తానని చెప్పి పరార్ అయింది. ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. మోసపోయానని తెలుసుకుని సిరివెన్నెల శుక్రవారం జనగామ పోలీసు స్టేషన్లో కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దామోదర్‌రెడ్డి తెలిపారు.