వేదికపై డీజే పాటలు.. స్టెప్పులేసిన ఎంపీ, ఎమ్మెల్యే

  • టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం
  • బతుకమ్మ బోనాలు, కోలాటాల, డప్పు చప్పుళ్లతో ర్యాలీ
  • ర్యాలీలో కర్రసాము చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్

యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు నియోజకవర్గం నారాయణపురం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమం సందడిగా సాగింది. బతుకమ్మ, బోనాలు ,కోలాటాలు,డప్పు చప్పులతో ర్యాలీ జరిగింది. ర్యాలీ మధ్యలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కర్రసాము చేసి కార్యకర్తలు, ప్రజలను హుషారెత్తించారు. ఎమ్మెల్యే కర్రసామును చూసి సంబరపడ్డ కార్యకర్తలు సభా వేదిక వద్దకు రాానే డీజే పాటలతో ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. 
 

తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కర్రసాసాము చేసి హుషారెత్తించడంతో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా మేము సైతం అంటూ డీజే పాటలకు స్టెప్పులేశారు. ప్రజాసమస్యలతో.. లేదా ఇతర సమావేశాల్లో కార్యకర్తలు, ప్రజలతో మమేకం అయినప్పుడు ఎప్పుడూ సీరియస్ గా ఉండే నేతలు ఇవాళ రొటీన్ శైలికి భిన్నంగా ఆడుతూ.. పాడుతూ యువకుల్లా ఉల్లాసంగా కనిపించడంతో కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో కేరింతలు కొట్టారు. 
కాస్త ఆలస్యంగా మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తదితరులు కూడా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.