‘క్యా అలీగఢ్.. క్యా గౌహటి.. అప్నా దేశ్.. అప్నా మాటీ(అలీగఢ్ అయితేంటి.. గౌహటి అయితేంటి.. అంతా మన దేశమే.. మన మట్టే)’ అంటూ 1969 ప్రాంతంలో హైదరాబాద్‌లోని గౌలిగూడ వీధుల్లో తెల్లవారుజామున నిక్కరు ధరించి, లాఠీలు చేబూని కవాతు చేస్తున్న యువత నినాదాలు వినిపించేవి. ఆ బృంద నాయకుడు బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఆ సమయంలో ప్రాంతమేదైనా దేశమంతా ఒకటనే జాతీయవాదాన్ని భుజానికెత్తున్న స్వయం సేవక్ ఆయన. లాఠీలు పట్టుకుని గౌలీగూడ వీధుల్లో తిరిగిన ఆయనే 1977లో ఉప్పెనలో చిక్కుకున్న దివిసీమలోని నాగాయలంక, భవానీపురం గ్రామాల ప్రజలకు సాయం చేసే ఆర్‌ఎస్‌ఎస్ బృందాలకు నాయకత్వం వహించారు.
దివిసీమ ఉప్పెనలో 14 వేల మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ 50 వేల మంది వరకు చనిపోయారని స్థానికుల అంచనా. సుమారు 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. చెట్టుకొకటి, పుట్టకొకటి చిక్కుకుని కుళ్లిపోయిన శవాలకు అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా లేకుండాపోయింది. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ మిషన్, బిల్లి గ్రాహం ఫౌండేషన్ సభ్యులతోపాటు దత్తాత్రేయ నాయకత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్ బృందాలు రంగంలోకి దిగి కుళ్లిన శవాల వాసనను భరిస్తూనే మంత్రోచ్ఛరణలతో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. అంతేగాక దివిసీమ ప్రాంతంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పేరిట దీన్ దయాళ్ కాలనీని నిర్మించారు. ఆయన సహాయ కార్యక్రమాలను దగ్గరగా చూసిన మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు ‘ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో దత్తాత్రేయ పోటీ చేస్తే నాకు డిపాజిట్ రాకపోవచ్చు’ అని అనడం ఆనాడు దత్తాత్రేయకు ప్రజల్లో వచ్చిన ఆదరణకు నిదర్శనం.
దేశవ్యాప్తంగా మంచి పేరు
దివిసీమలో సంఘ్ కార్యకర్తలు చేసిన కార్యక్రమాలతో ఆర్‌ఎస్‌ఎస్‌తోపాటు దత్తాత్రేయకు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది. 1968లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దత్తాత్రేయ దీనులను, దీన్‌దయాళ్‌ను ఎప్పుడూ మరవలేదు. 1974లో ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ ప్రచారక్‌గా, 1975లో లోక్ సంఘర్ష్ సమితి జాయింట్ కన్వీనర్‌గా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద అరెస్టయి జైలుకెళ్లారు. 1980లో నాగ్‌పూర్‌లో ఉండగానే బీజేపీలో చేరిన ఆయనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ హైకమాండ్ ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. హైదరాబాద్‌లో ఆలె నరేంద్ర, జూపూడి యజ్ఞనారాయణ, టి.సూర్యప్రకాశ్ రెడ్డి, పీవీ చలపతిరావు తదితర నాయకులతో కలిసి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు.
దత్తాత్రేయ స్థిత ప్రజ్ఞుడు. భూషిస్తే పొంగడు.. దూషిస్తే కుంగడు. కోపగించడమనేది ఆయనకు చేతగాని పని. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ప్రతీకారేచ్ఛను మనసులోకి రానీయలేదు. ఆయన మనసు మెత్తన.. ఆయన చేతిస్పర్శ వెచ్చన. ఎంపీగా ఉన్నప్పుడైనా, మంత్రిగా పనిచేసినప్పుడైనా ఆయన దగ్గరికొచ్చే వాళ్లంతా సామాన్యులే. చిన్న చిన్న సమస్యలతో వేలాదిమంది రోజూ ఆయన సాయం కోరేవారు. ఎవరినీ కాదనేవారు కాదు. ప్రతి ఒక్కరికీ రికమండేషన్ లెటర్లిచ్చేవారు. అతి మంచితనం ఆయనకు కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. హైదరాబాద్ నగరంలో గంగా జమున తెహజీబ్‌కు ప్రతీకగా ఆయన నిలిచారు.
అందరివాడుగా..
దత్తాత్రేయను అందరివాడిగా, సౌమ్యుడిగా గుర్తు చేసుకునేలా చేసిన కార్యక్రమం అలయ్.. బలయ్. ప్రతి సంవత్సరం దసరా రోజు నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనానికి రాజకీయాల్లో బీజేపీకి వైరిపక్షమైన కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అంతా వచ్చేవారు. గద్దర్, విమలక్కలాంటి విప్లవ గాయకులు కూడా అలయ్ బలయ్‌కు వచ్చేవారంటే పార్టీగా కాకుండా దత్తాత్రేయ మాటపై ఉన్న అభిమానమని అర్థం చేసుకోవచ్చు. ఈ సంబురాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేది. మక్కగారెలు, మలిద ముద్దలు, రోటి, బోటి, జొన్న రొట్టె, సజ్జ రొట్టె, సొంగరొట్టె, గజ్వేల్ మక్క గారెలు, సిద్ధిపేట సర్వపిండి లాంటి తెలంగాణ వంటకాలెన్నింటినో ఆయన అతిథుల కోసం తయారు చేయించేవారు. జమ్మితోపాటు ప్రేమనూ పంచేవారు. నక్సలైట్ సిద్ధాంతాలను తీవ్రంగా వ్యతిరేకించే దత్తాత్రేయ సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రాజ్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియల్లో వరవరరావుతోపాటు కలిసి పాల్గొన్నారు. ‘అది ఎన్‌కౌంటర్ కాదు. హత్య’ అని ఖండించారు. అందుకే ఒక పౌర హక్కుల సంఘం నేత దత్తాత్రేయను ఉద్దేశించి ఓ సందర్భంలో ‘కాషాయం కప్పుకున్న నక్సలైట్’ అని చెప్పడం గమనార్హం. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు శత్రువులు లేరంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంలో దత్తాత్రేయది కీలక పాత్ర. 1997లో అప్పటి రాష్ట్ర బీజేపీ నేతలు విద్యాసాగర్‌రావు, నల్లు ఇంద్రాసేనారెడ్డి, ఆలె నరేంద్రతో కలిసి ‘ఒక్క ఓటు–రెండు రాష్ట్రాలు’ అనే తీర్మానాన్ని కాకినాడలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చేయించారు. మలి దశ తెలంగాణ ఉద్యమం బాగా సాగుతున్న రోజుల్లో లోక్‌సభలో అప్పటి బీజేపీ పక్ష నేత సుష్మాస్వరాజ్‌కు రాష్ట్ర ఆకాంక్షను అనేక సందర్భాల్లో వివరించారు. రైల్వే మంత్రిగా ఎంఎంటీఎస్, మెట్రో మంజూరయ్యేందుకు కృషి చేశారు. బీబీ నగర్‌లో ఎయిమ్స్ మంజూరుకు దత్తాత్రేయ సహకరించారు. తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న దత్తన్న ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు. పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రం హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ఇటీవల నియమించింది. ఆయన సుదీర్ఘ రాజకీయ, పరిపాలన అనుభవం హిమాచల్ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా ఉపయోగపడుతుందనడం అతిశయోక్తి కాదేమో!
–గిరీష్