చెన్నై, ముంబై, కోల్ కతా, సూరత్ లకు ప్రమాదం
హిమాలయాలు కరగడం వల్ల సముద్ర మట్టాల్లో పెరుగుదల
ప్రస్తుత ఎమిషన్స్ ప్రకారం ముప్పు చాలా ఎక్కువ
చెన్నై, ముంబై, కోల్‌కతా, సూరత్.. ఈ నాలుగు నగరాలు మునిగిపోయే ముప్పు ముంగిట ఉన్నాయి. వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కుతోందని, దాని వల్ల 2100 నాటికి సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునగిపోతాయని ఐక్యారాజ్య సమితికి చెందిన ఐపీసీసీ రిపోర్ట్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే జరిగితే న్యూయార్క్, షాంఘై వంటి 45 తీర ప్రాంత నగరాలు మునిగిపోతాయనీ హెచ్చరించింది. నిజానికి ఆ జాబితాలో ఏయే నగరాలున్నాయో చెప్పకపోయినా, రీసెర్చ్‌కు వాడుకున్న పేపర్ల ఆధారంగా ఆ 45 నగరాలను ఐపీసీసీ వెల్లడించింది. ఆ జాబితాలో మన దేశంలోని ఆ నాలుగు సిటీలూ ఉన్నాయి. ఏ శతాబ్దం ముగిసే నాటికి హిమాలయ పర్వతాల్లోని గ్లేసియర్లు 64 శాతం వరకు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరిగి ఆ ముప్పును మోసుకొస్తున్నాయని ఐపీసీసీ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే సముద్రాలు 15 సెంటీమీటర్ల మేర పెరిగాయని ఐపీసీసీ హెచ్చరించింది.
ఏటా 3.6 మిల్లీమీటర్ల మందం పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కువ మంచి నీటిని అందించే మధ్య ఆసియా, దక్షిణాసియా, మధ్యాసియా ప్రాంతాల్లోని హిందూ కుష్ హిమాలయాన్ (హెచ్‌కేహెచ్) రీజియన్‌లో24 కోట్ల మంది బతుకుతున్నారని, సముద్రాల్లో మార్పుల వల్ల వాళ్ల బతుకుదెరువుపై ప్రభావం పడుతుందని ఐపీసీసీ రిపోర్టు తయారు చేసిన సైంటిస్టుల్లో ఒకరైన అంజల్ ప్రకాశ్ చెప్పారు. 3.5 నుంచి 6 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే హిమాలయాల్లోని గ్లేసియర్లు 36 నుంచి 64% కనుమరుగవుతాయని హెచ్చరించారు. ఆ కరిగిన నీరంతా సముద్రాల్లోకి చేరి ఆ నాలుగు సిటీలను ముంచెత్తుతాయన్నారు. ప్రస్తుతం విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాల రేటును చూస్తే ముప్పు చాలా తీవ్రంగానే ఉందన్నారు. దానికి విరుగుడు కేవలం మనం ఎమిషన్స్‌ను తగ్గించడమేనన్నారు. పర్యావరణానికి మేలు చేసే విధానాలను అమలు చేయాలని అన్నారు.
గోధుమ పంట తగ్గుతది
మన దగ్గర ఉత్తరాది వారికి ముఖ్యమైన ఆహారం రొట్టెలు. అందులోనూ ఎక్కువగా గోధుమలే వాడతారు. విదేశాల్లో ఎక్కువ వంటల్లో వాటా గోధుమలదే. కానీ, ఆ గోధుమలే రాబోయే కాలంలో తగ్గిపోయే ప్రమాదముందట. వాతావరణ మార్పులతో గోధుమ పంట బాగా పడిపోతుందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో టెంపరేచర్లు ఎడాపెడా పెరిగితే కరువులు ఏర్పడి గోధుమ దిగుబడి 60 శాతం పడిపోతుందని హెచ్చరించారు. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగితే గోధుమ పండించే పొలాలు 30 శాతం తగ్గుతాయని, ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే దాని ప్రభావం 15 శాతం పొలాలపై పడుతుందని పేర్కొన్నారు. ఎలాంటి నియంత్రణా లేకపోతే ప్రభావం నాలుగింతలుంటుందని స్టడీలో పాల్గొన్న ప్రొఫెసర్ సాంగ్ ఫెంగ్ చెప్పారు. 27 క్లైమేట్ మోడళ్లను పరిశీలించి సైంటిస్టులు ఈ నిర్ధారణకు వచ్చారు. పంట విస్తీర్ణం ఎంత తగ్గితే తినే తిండి ధరలు అంత ఎక్కువ అవుతాయని హెచ్చరించారు.