ట్రైన్‌‌లో దొంగలు.. ఫ్లైట్లలో పోలీసులు..నాగ్​పూర్‌‌‌‌లో ట్రేసింగ్‌‌

ట్రైన్‌‌లో దొంగలు.. ఫ్లైట్లలో పోలీసులు..నాగ్​పూర్‌‌‌‌లో ట్రేసింగ్‌‌
  • రైల్వేస్టేషన్‌‌లో మహిళ సహా ముగ్గురు అరెస్ట్
  • నిందితుల నుంచి రూ.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌‌, వెలుగు: హిమాయత్‌‌నగర్‌‌‌‌లో మంగళవారం జరిగిన దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. దొంగలు ట్రైన్‌‌లో పరారవుతున్నారని తెలుసుకున్న పోలీసులు.. మూడు టీమ్​లుగా విడిపోయి విమానాల్లో వెళ్లి మరీ ముగ్గురు నిందితులను నాగ్​పూర్‌‌‌‌ రైల్వే స్టేషన్‌‌లో అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని, వారిని హైదరాబాద్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలను ఈస్ట్​ జోన్ డీసీపీ బాలస్వామితో కలిసి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌‌ గురువారం మీడియాకు వెల్లడించారు. 

గుజరాత్‌‌కు చెందిన రోహిత్ కెడియా ఆయిల్‌‌ వ్యాపారం చేస్తూ హిమాయత్‌‌నగర్‌‌లో నివసిస్తున్నాడు. ఆయన ఇంట్లో బీహార్​లోని బిరౌల్‌‌ గ్రామానికి చెందిన సుశీల్‌‌ ముఖియా(29), కోల్‌‌కతాకు చెందిన బసంతి ఆర్తీ(40) పనిచేస్తున్నారు. రోహిత్‌‌ గత శుక్రవారం తన కూతురు వివాహం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌‌కి వెళ్లాడు. ఇదే అదనుగా  రోహిత్‌‌ ఇంట్లో దొంగతనం చేయాలని సుశీల్‌‌ ముఖియా, బసంతి ఆర్తీలు ప్లాన్ చేశారు.

 ఢిల్లీకి చెందిన మొలూ ముఖియా(35)ను హైదరాబాద్​కు పిలిపించారు. ముగ్గురు కలిసి ఈ నెల10న అర్ధరాత్రి దాటిన తరువాత  రోహిత్‌‌ ఇంట్లో.. రూ.20 లక్షలు నగదు, 710 క్యారెట్స్ డైమండ్‌‌ ఆభరణాలు, కిలో 420 గ్రాముల బంగారం, 215 గ్రాముల వెండి సహా  రూ.5 కోట్ల విలువైన సొత్తు చోరీ చేశారు. మేనేజర్‌‌‌‌ అభయ్‌‌ కెడియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..రోహిత్‌‌ ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. ఇంట్లో పనిచేసే సుశీల్‌‌, బసంతి, మొలులను నిందితులుగా 
నిర్ధారించుకున్నారు. 

ట్రైన్‌‌లో దొంగలు, విమానంలో పోలీసులు

సుశీల్‌‌ గ్యాంగ్ సికింద్రాబాద్  రైల్వేస్టేషన్‌‌కు వెళ్లి అక్కడి నుంచి తెలంగాణ ఎక్స్​ప్రెస్‌‌ ట్రైన్‌‌లో పరారైనట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు మూడు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎక్స్​ప్రెస్​ ట్రైన్ వెళ్లే రూట్స్​లోని రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. 

పోలీసులు మూడు టీమ్స్ గా విడిపోయి విమానాల్లో భూపాల్‌‌, నాగ్​పూర్‌‌‌‌, పాట్నాకు బయలుదేరివెళ్లారు. రైలు నాగ్​పూర్‌‌ స్టేషన్‌‌కు చేరుకునే సమయానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక జీఆర్‌‌‌‌పీ పోలీసులతో కలిసి ట్రైన్ చెక్​ చేశారు. ఓ కోచ్‌‌లో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల నుంచి డబ్బు, డైమండ్స్, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని హైదరాబాద్ తరలించారు. సీపీ సీవీ ఆనంద్‌‌ మాట్లాడుతూ.. డీటైల్స్ పూర్తిగా తెలుసుకున్న తరువాతే సర్వెంట్స్‌‌ ను నియమించుకోవాలన్నారు. తమను సంప్రదిస్తే ఎవరు ఏంటనేది వెరిఫై చేసి చెబుతామని పేర్కొన్నారు.