క్యాన్సర్‌తో పోరాడుతున్నా.. స్టేజ్ త్రీ: హీనా ఖాన్

క్యాన్సర్‌తో పోరాడుతున్నా.. స్టేజ్ త్రీ: హీనా ఖాన్

హిందీ టీవీ నటి హీనా ఖాన్ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. తాను బ్రెస్ట్‌ క్యాన్సర్‌‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. తన క్షేమం కోసం అభిమానులు ప్రార్థించాలని కోరిన ఆమె, ఈ వ్యాధిని జయించి తిరిగొస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

హీనాఖాన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. వాటిని ఎవరూ నమ్మలేదు. ఈ క్రమంలో ఆమె తన అనారోగ్యం గురుంచి బయట ప్రపంచానికి తెలియజేశారు. "హలో అందరికీ హాయ్.. నన్ను ఆరాధించే, అభిమానించే ప్రతి ఒక్కరితో ఓ వార్తను పంచుకోవాలనుకుంటున్నాను. నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. స్టేజ్‌ త్రీలో ఉంది. ఇది సవాలుతో కూడుకున్న సమయం. రోగనిర్ధారణ ఉన్నప్పటికీ, నేను బాగానే ఉన్నానని అందరికీ భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. నా చికిత్స ఇప్పటికే ప్రారంభమైంది. ఈ వ్యాధిని అధిగమించి దృఢంగా తిరిగొస్తాను.."

"ఈ కష్ట సమయంలో నాపై గౌరవం ఉంచి గోప్యతకు భంగం కలిగించొద్దని మీ అందరినీ కోరుతున్నా. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. నా ఈ ప్రయాణంలో మీ వ్యక్తిగత అనుభవాలు, సహాయక సూచనలు నాకు కొత్త మార్గాలను సూచిస్తాయి.." అని హీనా ఖాన్ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

కాగా, హీనా ఖాన్.. ఏప్రిల్‌లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తిండి సరిగా తినలేకపోతున్నానని చెప్పింది. క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ అయ్యాకే ఆమె ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. "యే రిష్తా క్యా కెహ్లాతా హై" సీరియల్‌లో నటించి మెప్పించిన హీనా ఖాన్.. కసౌటి జిందగీ కే, నాగిన్‌ (5వ సీజన్‌) సీరియల్స్‌లో ముఖ్యపాత్రలు పోషించింది. హిందీ బిగ్‌బాస్‌లోనూ కనిపించింది.