- ఇన్వెస్టర్లు పెద్దగా పట్టించుకోరన్న ఎనలిస్టులు
న్యూఢిల్లీ: పదవిలో ఉన్న సెబీ చైర్‌పర్సన్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలు చేయడంతో సోమవారం మార్కెట్ ఒక్కసారిగా పడొచ్చని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ వెంటనే రికవర్ అవుతుందని చెబుతున్నారు. అదానీ గ్రూప్ షేర్లను కావాలని పెంచిన ఆఫ్ షోర్ ఫండ్స్‌లో ప్రస్తుత సెబీ చైర్‌పర్సన్ మాధవి పురి బచ్‌కు వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అందుకే అదానీ గ్రూప్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ‘సిట్టింగ్ సెబీ చీఫ్‌పై ఆరోపణలు రావడంతో మార్కెట్ ఒక్కసారిగా పడొచ్చు. రికవరీ కూడా అంతే వేగంగా ఉంటుంది.
ఒకవేళ మాధవి సెలవులు తీసుకొని కనబడకుండా పోతే మాత్రం అప్పుడు అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితినే ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చార్ విషయంలో చూశాం’ అని ఇండిపెండెంట్ మార్కెట్ ఎనలిస్ట్ అంబరీష్ బలిగా అన్నారు. మార్కెట్ సోమవారం స్టేబుల్‌గా ఉంటుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఎనలిస్ట్ జీ చొక్కలింగమ్ అన్నారు.
ఈ సమస్య సెబీ ఇంటర్నల్ వర్క్‌కు సంబంధించిందని, మార్కెట్ దీనికి పెద్దగా స్పందించదని వెల్త్‌మిల్స్ ఎనలిస్ట్ క్రాంతి బతిని అన్నారు. పానిక్ సెల్లింగ్ ఉండదని, ఒకవేళ మార్కెట్ పడినా, వెంటనే బయ్యింగ్ వస్తుందని అంచనా వేశారు. ఈసారి హిండెన్‌బర్గ్ ఆరోపణలు మితిమీరాయని, మొదటిసారి అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చెసినప్పటికీ, ఈ గ్రూప్ షేర్లు నష్టాల నుంచి రికవర్ అవ్వగలిగాయని ఆల్ఫానిటి ఫిన్‌టెక్ ఫౌండర్ యూఆర్ భట్ పేర్కొన్నారు. తాజా ఆరోపణలు పరోక్షంగా చేసినవని, ఒకవేళ మార్కెట్ పడినా, వెంటనే రికవర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.
సెబీపై హిండెన్‌బర్గ్ ఆరోపణలు..
అకౌంటింగ్ ఫ్రాడ్స్‌కు, షేర్ల మానిప్యులేషన్‌కు పాల్పడిందని అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్, తాజాగా సెబీని టార్గెట్ చేసింది. అదానీ గ్రూప్‌లో ఎటువంటి అవకతవకలు జరగలేదని సెబీ దర్యాప్తు తేల్చిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్‌పై చర్యలు తీసుకోకుండా సెబీ తమకు షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. రూల్స్ నుంచి తప్పించుకోవడానికి అదానీ గ్రూప్ ఎలా విదేశీ సంస్థలను వాడుకుందో సెబీకి తెలుసని, అదానీ ఆఫ్‌షోర్ ఫండ్స్ స్కామ్‌లో సెబీకి కూడా వాటా ఉందని ఆరోపించింది.
విజిల్‌బ్లోయర్ డాక్యుమెంట్ ప్రకారం, సెబీ ప్రస్తుత చైర్‌పర్సన్ మాధవి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 2015 జూన్ 5 న సింగపూర్‌లో ఐపీఈ ప్లస్ ఫండ్1 లో మొదటిసారిగా అకౌంట్ ఓపెన్ చేశారు. ఈ ఫండ్స్‌లో చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్ ‘శాలరీ’ ద్వారా వచ్చాయని పేర్కొన్నారు. వీరి నికర సంపద 10 మిలియన్ డాలర్లుగా ఉంది’ అని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. అదానీ గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న ఆఫ్‌షోర్ ఫండ్ హోల్డర్లను పట్టుకోవాలంటే సెబీ మొదట అద్దంలో చూసుకోవాలని, తన సొంత చైర్‌పర్సన్ మెడకు చుట్టుకుంటుందనే సెబీ దర్యాప్తు చేయలేదని పేర్కొంది.
సెబీలో జాయిన్ కాకముందు చేసిన పెట్టుబడులవి..
హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై సెబీ చైర్ పర్సన్, ఆమె భర్త స్పందించారు. మాధవి సెబీలో హోల్‌టైమ్ మెంబర్‌గా జాయిన్ కాకముందు అంటే అప్పటికి రెండేళ్ల ముందు ఐఐఎఫ్‌ఎల్ ప్రమోట్ చేసిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఆమె 2017 లో హోల్‌టైమ్ మెంబర్‌గా మారిన తర్వాత మాధవికి చెందిన రెండు కన్సల్టింగ్ కంపెనీలు ‘డార్మెంట్ (పనిచేయకపోవడం)’ స్టేట్‌లోకి వెళ్లిపోయాయని అన్నారు.
వివిధ రూల్స్‌ను ఉల్లంఘించినందుకు షోకాజ్ నోటీసులు అందుకున్న హిండెన్‌బర్గ్, వీటికి సమాధానం ఇవ్వకుండా సెబీ క్రెడిబిలిటీపై ఆరోపణలు చేసిందని, సెబీ చైర్‌పర్సన్ క్యారెక్టర్‌పై దాడులు చేసిందని
ఈ మార్కెట్ రెగ్యులేటరీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
అదానీ షేర్లలో ఇన్వెస్ట్ చేయలేదు: 360 వన్ వెల్త్‌మేనేజ్‌మెంట్
మరోవైపు మాధవి బచ్, ధవల్ బచ్‌కు వాటాలు ఉన్న ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అదానీ గ్రూప్ షేర్లలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఎటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయలేదని 360 వన్ వెల్త్‌మేనేజ్‌మెంట్ (గతంలో ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్‌మెంట్) ప్రకటించింది. ఫండ్‌లోకి వచ్చిన పెట్టుబడుల్లో వీరి వాటా 1.5 శాతం కంటే తక్కువ ఉందని, పెట్టుబడి నిర్ణయాల్లో వీరికి ఎటువంటి అధికారం లేదని వివరించింది. ఈ ఫండ్ రూల్స్‌ను ఫాలో అయ్యిందని, 2013 అక్టోబర్ – 2019 అక్టోబర్ మధ్య ఇది యాక్టివ్‌గా ఉందని పేర్కొంది.
ఐపీఈ ప్లస్ ఫండ్ 1 అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ 48 మిలియన్ డాలర్లు కాగా, 90 శాతం పెట్టుబడులు బాండ్లలో చేశామని 360 వన్ వెల్త్‌మేనేజ్‌మెంట్ పేర్కొంది. అదానీ గ్రూప్ కూడా హిండెన్‌బర్గ్ ఆరోపణలపై స్పందించింది. తమకు సెబీ చైర్‌పర్సన్‌కు, ఆమె భర్తకు మధ్య ఎటువంటి వాణిజ్య సంబంధం లేదని తెలిపింది. పబ్లిక్‌లో అందుబాటులో ఉన్న వివరాలను హిండెన్‌బర్గ్ తప్పుగా వాడి, మాన్యిప్యులేట్ చేస్తోందని ఆరోపించింది.