అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో భారత స్టాక్ మార్కెట్లను వణికించిన అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ఫౌండర్ నాథన్ అండర్సన్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో చర్చించాకే మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు నాథన్ అండర్సన్ తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు లేవని అన్నారు. అనుకున్న లక్ష్యలు సాధించినట్లు వెల్లడించారు.
"హిండెన్ బర్గ్ అనేది నా జీవితంలో ఓ అధ్యాయం మాత్రమే. సంస్థ స్థాపించినప్పుడు నన్ను నేను నిరూపించుకునేందుకు ఎంతో కష్టపడ్డా. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపా.. ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు, ఒత్తిళ్లను ఎదుర్కొన్నా. అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా పనిచేశా. కానీ, ఇప్పుడు నా జీవితంలో ఆ అవసరం లేదనిపిస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో చర్చించాక మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా.. దీని వెనుక ఎలాంటి బెదిరింపులు, భయాలు, ఆరోగ్య కారణాలు లేవు. విజయవంతమైన కెరీర్ ఏదో ఒకరోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాకు చెప్పారు. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది.." అని నాథన్ అండర్సన్ ప్రకటనలో తెలిపారు.
A Personal Note From Our Founderhttps://t.co/OOMtimC0gV
— Hindenburg Research (@HindenburgRes) January 15, 2025
ఏంటి ఈ హెండెన్‌బర్గ్ రీసెర్చ్..?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థను 2017లో నాథన్ అండర్సన్ స్థాపించారు. న్యూయార్క్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు జరుపుతోంది. హెండెన్‌బర్గ్ షార్ట్ సెల్లింగ్‌కు పేరుగాంచినప్పటికీ.. ఏవేని కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలను గుర్తించి బయటపెట్టడం దీని మరో విధి.
రెండేళ్ల క్రితం భారత్‌కు చెందిన అదానీ గ్రూప్‌పై ఈ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని ఆరోపించింది. అలా విలువ పెరిగాక.. సదరు షేర్లను తనఖా పెట్టి కోట్లలో రుణాలను పొందిందని, అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు ఓ నివేదికను బయటపెట్టింది. అంతే, ఒక్కసారిగా అదానీ గ్రూప్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. అప్పటివరకూ ప్రపంచ కుబేరుల్లో రెండు.. మూడు స్థానాల్లో కొనసాగిన గౌతమ్ అదానీ ఒక్కసారిగా వంద స్థానాలకు పడిపోయాడు.
అదానీ గ్రూప్ షేర్లు బూమ్
మొత్తానికి హిండెన్‌బర్గ్ మూతపడుతుండటంతో.. అదానీ గ్రూప్ షేర్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అదానీ పవర్ 9.21 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 8.86 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 7.72 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 7.10 శాతం, ఎన్‌డిటివి 7 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 6.63 శాతం, అదానీ పోర్ట్స్ స్టాక్ 5.48 శాతం, అంబుజా సిమెంట్స్ 4.55 శాతం, ఏసీసీ షాట్-అప్ 4.14 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ (3.74 శాతం), అదానీ విల్మార్ (0.54 శాతం) పెరిగాయి.