ఆగస్టు 11, 2023న భారత ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టింది. భారతీయ శిక్షాస్మృతి 1860, భారతీయ సాక్ష్యాధారాల చట్టం 1872, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లను తొలగిస్తూ వాటిస్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య , భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అనే బిల్లులను ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను జాగ్రత్తగా గమనించినప్పుడు పేర్లు మినహా ప్రతిపాదించిన మార్పులు అంతగా లేవు. ఇప్పుడున్న చట్టాల్లో ఈ కొత్త బిల్లులు తెచ్చే మార్పులు 20 నుంచి 25శాతం మాత్రమే.
గుణాత్మకంగా చూస్తే ఈ మార్పులు ఎక్కువ శాతం పాత సెక్షన్లని కొత్త సెక్షన్లుగా మార్చడం మినహా పెద్దగా మార్పులేమీ లేవు. ప్రతిపాదించిన మార్పులు ఎక్కువగా వ్యక్తి స్వేచ్ఛను హరించేవే. ప్రజాస్వామ్య స్ఫూర్తిని తొలగిస్తూ నిరంకుశత్వం వైపు ప్రయాణం చేసేవిధంగా ఈ మార్పులు ఉన్నాయి. పోలీస్ కస్టడీని పెంచడం, రాజద్రోహాన్ని తొలగిస్తూ దాన్ని మరో రూపంలో ప్రతిపాదించడం లాంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈ కొత్త చట్టాలకు ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లు జ్ఞాపకం ఉంచుకునే విధంగా లేవు. అదేవిధంగా వాటిని పలకడానికి అనువుగా లేవు. ఈ పేర్లు లాయర్లకి, న్యాయమూర్తులకే కష్టంగా ఉన్నాయి. మామూలు ప్రజల సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఈ పేర్లు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేవు. మరోవిధంగా చెప్పాలంటే ఈ ప్రతిపాదించిన పేర్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.
రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ప్రకారం అధీకృత చట్టాల భాష అంటే పార్లమెంట్, రాష్ర్ట శాసనసభల్లో ప్రవేశపెట్టే చట్టాల భాష ఇంగ్లీషులో ఉండాలి. అంతేకానీ సంస్కృతంలో కానీ హిందీలోగానీ ఉండటానికి వీల్లేదు. ఈ ప్రతిపాదిత కొత్త శాసనాల భాష పేర్లు తప్ప అంతా ఇంగ్లీషులోనే ఉంది. పేర్లు మాత్రం సంస్కృతంలో ఉన్నాయి. భారతీయతని సూచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం భావించినట్టు ఉన్నది. ఈ విధంగా పేర్లు ఉంచడం అన్నది ఆర్టికల్ 348కి విరుద్ధం. ఈ శీర్షికలు హిందీలో ఉన్నాయని, సంస్కృతంలో ఉన్నాయని అప్పుడే కొంతమంది దక్షిణాది ముఖ్యమంత్రులు మాట్లాడినారు. ఇది ఒకరకంగా బలవంతంగా హిందీనో, సంస్కృతాన్నో ప్రజల మీద రుద్దడంగా భావించవచ్చు. ఈ పేర్లు పలకడానికి వీలుగా లేవు. వినడానికి అనుకూలంగా లేవు. భాషకు సంబంధించిన అంశం రాజ్యాంగ అసెంబ్లీలో చర్చించారు. ఆ చర్చలు వాడిగా వేడిగా జరిగాయి. ఈ నిబంధనలు అన్నీ అధికార భాషలో ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్లమెంట్, శాసన సభలు ఈ భాషను మార్చాలని అన్న తీర్మానాన్ని చేసేవరకు శాసనాల భాష ఇంగ్లీషులోనే కొనసాగాలి. అలాంటిది ఏమీ జరగలేదు.
భాషాభిమానులు ఉద్యమించాలి
పాత చట్టాలని, బ్రిటిష్వాళ్లు చేసిన చట్టాలని మేం మార్చినాం అని చెప్పుకోవడానికి తప్ప ఈ కొత్త చట్టాల్లో గొప్ప మార్పులేమీ లేవు. ఏమైనా ఉన్నవి అంటే అది ప్రజల స్వేచ్ఛని హరించేవి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేవి మాత్రమే. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఉపయోగించే భాష ఇంగ్లీషు. తెలుగు భాష మీద కానీ, ప్రాంతీయ భాషలమీద కానీ ఎంత అభిమానం ఉన్నా అక్కడ ప్రాంతీయ భాషలని అమలుచేసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల న్యాయమూర్తులు ఈశాన్య రాష్ట్రాలకు, హిందీ రాష్ట్రాలకు బదిలీలపైన వెళుతున్నారు. అదేవిధంగా ఆ రాష్ట్రాల న్యాయమూర్తులు ఇక్కడికి వస్తున్నారు. ప్రాతీయ భాషలు, హిందీ భాష అనేవి ఆటంకంగా మారతాయి.
శాసనాలు ఇంగ్లీషులోనే ఉన్నాయి. తీర్పులు ఇంగ్లీషులోనే ఉన్నాయి. మనది కామన్ లా దేశం. ఇంగ్లీషు తీర్పులని చాలా తీర్పుల్లో పేర్కొంటాం. ఇంగ్లీషుకి అలవడి ఉన్నాం. ఈ దశలో హిందీని రుద్దడం ఎంతవరకు సమంజసం. ఇప్పుడు పేర్ల వరకు మాత్రమే పరిమితమైనా ఈ భాష సెక్షన్ల వరకు తీసుకునిపోరన్న గ్యారంటీ ఎక్కడుంది?.కోర్టులకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాకుండా భాషాభిమానులు ఈ విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పేర్ల విషయంలో ఎన్ని అభ్యంతరాలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యంతరాలను పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు. చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ సంక్షేమ పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఒక్కరు కూడా ఈ భాషాధిపత్యం గురించి మాట్లాడటం లేదు. ఈ విషయాలన్నీ అలోచించాల్సిన విషయాలు.
మైనార్టీ భాషలపై హిందీ ఆధిపత్యం
మనదేశంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అందరికీ అనుకూలంగా ఉండే భాష ఇంగ్లీషు. దీన్నే అనుసంధాన భాషగా గుర్తించారు. తమ సంస్కృతి, భాష గురించి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తమ గుర్తింపు కొనసాగాలని కోరుతున్నారు. ఈ దశలో మూడు ప్రధాన చట్టాల పేర్లు మార్చడం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదు. మనదేశంలోని చాలా రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినాయి. దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా ఆ రాష్ట్రంలో మాట్లాడే భాషను అధికార భాషగా గుర్తించినారు. ఆ విధంగా చట్టాలని కూడా తీసుకుని వచ్చినారు.
హిందీని, సంస్కృతాన్ని ఇతర రాష్ట్రాల మీద రుద్దడం అంటే అది మైనారిటీ భాషల మీద ఆధిపత్యంగా భావించాల్సి ఉంటుంది. హిందీని జాతీయ భాషగా చాలా రాష్ట్రాలు గుర్తించే పరిస్థితి లేదు. అది దగ్గరలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హిందీ మాత్రమే భారతీయులని ఏకం చేస్తుందన్న కేంద్ర హోం మంత్రి మాటలని దక్షిణ భారతీయులు ఏ మాత్రం అంగీకరించే పరిస్థితిలో లేరు.
ALSO READ : మజ్లిస్ కంచుకోటపై..కాంగ్రెస్ ఫోకస్!
అది సాధ్యం కూడా కాదు. కోర్టులు ఇప్పటికే పనిభారంతో కుంగి పోతున్నాయి. పెద్దగా మార్పులు లేని ఈ కొత్త చట్టాల వల్ల కలిగే మేలుకన్నా కీడే ఎక్కువ. హత్యానేరాన్ని 302గా దేశంలో చిన్న పిల్లలకు కూడా తెలుసు. అదేవిధంగా 420 అనేది కూడా అందరికీ తెలుసు. వాటిని మార్చేంత పనిని కేంద్ర ప్రభుత్వం చేయలేదు. నెంబరుని మార్చినంత మాత్రాన ఒనగూరే ప్రయోజనం లేదు.
– మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)