
న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 59వ జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జ్ఞానపీఠ్ సెలెక్షన్ కమిటీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రముఖ రచయిత్రి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే ఆధ్వర్యంలో సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ కు చత్తీస్ గఢ్ నుంచి ఎంపికైన ఒకేఒక్క రచయిత వినోద్.
హిందీ భాషలో అతిగొప్ప సమకాలీన రచయితల్లో ఆయన ఒకరు. 88 ఏండ్ల వినోద్ షార్ట్ స్టోరీ రైటర్, కవి, వ్యాసకర్త. మొత్తంగా ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయిత. ఆయనకు ఈ అవార్డుతో పాటు రూ.11 లక్షల నగదు బహుమతి, సరస్వతీ దేవి కంచు విగ్రహం ప్రదానం చేయనున్నారు. హిందీ సాహిత్యంలో అద్భుతమైన కృషి చేయడంతో పాటు సృజనాత్మకత, విలక్షణమైన రచనా శైలికిగాను వినోద్‌ను జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేశామని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. కాగా.. ‘దీవార్ మే ఏక్ ఖిర్కీ రహ్ తీ థీ’ (గోడలో ఒకేఒక్క కిటికీ ఉండేది) పుస్తకానికిగాను 1999లో సాహిత్య అకాడమీ అవార్డును కూడా వినోద్ అందుకున్నారు. అలాగే.. నౌకర్ కీ కమీజ్ (నవల), సబ్ కుఛ్ హోనా బచా రహేగా వంటి రచనలు చేశారు.