- హిమాయత్ నగర్ టీటీడీ ముందు హిందూ సంఘాల ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు: తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగారు. ఆదివారం లిబర్టీ చౌరస్తా నుంచి హిమాయత్ నగర్ లోని టీటీడీ దేవస్థానం వరకు హిందూ జనజాగృతి సమితి, రాష్ట్రీయ శివాజీ సేన, గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కో, హనుమాన్ చాలిసా గ్రూప్, హిందూ సంఘటన ఏకతా మంచ్, సనాతన హిందూ సంఘ్ , హిందూ ధర్మ దీక్షా సేవక్, దళిత హైందవ సైన్యం , శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫౌండేషన్ ధార్మిక సెల్ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు ర్యాలీ చేపట్టారు. మొదట ఏపీ మాజీ సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గాడి చేతన్, కరాటే కల్యాణి మాట్లాడుతూ హిందువుల మనోభాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలపడం బాధాకరమన్నారు. ఘటనకు బాధ్యులైన గత పాలకులతో సహా టీటీడీ ఈవో, చైర్మన్ , బోర్డు మెంబర్లను శిక్షించాలని డిమాండ్ చేశారు. టీటీడీలోని అన్యమత ఉద్యోగులను తొలిగించాలని, గత వైసీపీ ప్రభుత్వం అనుమతించిన టెండర్లను రద్దు చేయాలన్నారు. జాతీయ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేసి , ప్రభుత్వాల ఆధీనంలో ఆలయాలు ఉండకుండా చూడాలన్నారు.
ఓయూ : తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడిన ఏపీ మాజీ సీఎం జగన్, ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ , టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఫొటోలు దహనం చేశారు.