'సప్తపది' వేడుక, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లదని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకున్నట్లు ఆరోపించిన కేసును రద్దు చేసింది.
ఏడడుగుల వేయడం, ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదన్న విషయాన్ని సమర్థించిన అలహాబాద్ హైకోర్టు.. తన నుంచి విడిపోయిన భార్య తనకు విడాకులు ఇవ్వకుండానే రెండవ వివాహం చేసుకుందని ఓ వ్యక్తి ఆరోపించిన కేసు విచారణను రద్దు చేసింది. స్మృతి సింగ్ అనే మహిళ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు విచారణకు అనుమతించగా.. వివాహం ఘనంగా జరుపుకోవడమంటే ఆచారాలు, ఇతర సంప్రదాయాల్లో వివాహాన్ని జరుపుకోవడమని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ వ్యాఖ్యానించారు. వివాహాన్ని తగిన ఆచారాల్లో వివాహం జరుపుకోకపోతే లేదా నిర్వహించకపోతే, అది ఘనమైనదిగా చెప్పలేమన్నారు.
పెళ్లి అనేది చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని హైకోర్టు తెలిపింది. హిందూ చట్టం ప్రకారం 'సప్తపది' వేడుక పెళ్లిని చెల్లుబాటుగా గుర్తించేందుకు అవసరమైన కార్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు. కానీ ఈ పెళ్లిలో అలాంటి వేడుక జరగనట్లు హైకోర్టు గుర్తించింది. కాబ్టటి ఈ పెళ్లి చెల్లుబాటు కాదని ప్రకటించింది. 1955 నాటి వివాహ చట్టంలో ఇలాంటి వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని తెలిపింది.
పిటిషనర్ స్మృతి సింగ్ వివాహం 2017లో సత్యం సింగ్తో ఘనంగా జరిగింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆమె అత్తమామల ఇంటిని విడిచిపెట్టి, కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విచారణ అనంతరం పోలీసులు భర్త, అత్తమామలపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత సత్యం తన భార్యపై ఆరోపణలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేశాడు. సదరు దరఖాస్తును సర్కిల్ అధికారి సదర్, మీర్జాపూర్ క్షుణ్ణంగా విచారించగా, స్మృతి చేసిన ఆరోపణలు వాస్తవమని తేలింది.
ఆ తర్వాత సత్యం తన భార్యపై రెండో పెళ్లి ఆరోపణలు చేశారు. తన భార్య స్మృతి సింగ్ రెండో వివాహం చేసుకుందని, సెప్టెంబర్ 20, 2021న ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే సత్యం సింగ్ ఏప్రిల్ 21, 2022న మీర్జాపూర్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి స్మృతి సింగ్కు సమన్లు పంపారు. దీనిపై సర్కిల్ అధికారి సదర్, మీర్జాపూర్ క్షుణ్ణంగా విచారించగా, స్మృతిపై ఆరోపణలు అవాస్తవమని తేలింది. దీనిని ఆమె సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానంపై హిందూ వివాహాల్లో సప్తపది కీలకమని వ్యాఖ్యలు చేసింది.