బంగ్లాదేశ్ దేశం మరీ ఓవరాక్షన్ చేస్తుంది.. ఇండియా చెప్పినా వినటం లేదు.. వార్నింగ్ ఇచ్చినా బెదరటం లేదు.. మన ఇస్కాన్ గురువును నెల రోజులకు పైగానే జైల్లో పెట్టింది. ఇస్కాన్ హిందూ మత గురువు చిన్మయి కృష్ణదాస్ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను సైతం కొట్టివేసింది బంగ్లాదేశ్ కోర్టు.. బెయిల్ ఇవ్వటానికి నో అంటోంది.. ఇండియా పదే పదే చేసిన విజ్ణప్తులు, హిందూ సంఘాల డిమాండ్లను సైతం లెక్కచేయకుండా.. బంగ్లాదేశ్ దేశం బరితెగింపు చర్యలకు దిగుతుంది
ఇస్కాన్ సంస్థ మాజీ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణ దాస్ బెయిల్ పిటిషన్ ను బంగ్లాదేశ్ కోర్టు తిరస్కరించింది. గురువారం (2 జనవరి 2025) బెయిల్ పిటిషన్ పై వాదనల నేపథ్యంలో చిట్టగాంగ్ లోని కోర్టు ముందు హాజరయ్యారు చిన్మయ్ కృష్ణదాస్. వాదనలు విన్న కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.
మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మఫిజుర్ హేక్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం.. దాదాపు 30 నిమిషాలు వాదనలు విన్న జడ్జీ మహమ్మద్ సైఫుల్ ఇస్లామ్ .. బెయిల్ పిటిషన్ ను తిరస్కరించినట్లు తెలిపారు.
చిన్మయ్ బెయిల్ తిరస్కరణపై కోల్ కతా ఇస్కాన్ వైస్ ప్రసిడెంట్ రాధా మోహన్ దాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్ వస్తుందని ఆశించామని కానీ బెయిల్ తిరస్కరణ నిరాశపర్చిందని అన్నారు. గత 42 రోజులుగా జైల్లో ఉంటున్నా ఇప్పటికీ బెయిల్ ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కృష్ణదాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసింది. దీంతో ఢాకాలోని హజ్రత్ షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కృష్ణదాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 42 రోజులుగా ఆయన జైల్లోనే మగ్గుతున్నారు.