
న్యూఢిల్లీ/ జైసల్మేర్: పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నామని, వాళ్లంతా ఈ నెల 27లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో.. మన దేశంలో ఉంటున్న పాకిస్తానీ హిందూ శరణార్థులు ఆందోళన చెందుతున్నారు. వాళ్లను దేశంలో ఉండేందుకు అనుమతిస్తారా..? లేక అందరిలాగానే వాళ్లనూ తిరిగి పాక్‌కు పంపిస్తారా..? అనే దానిపై స్పష్టత లేక భయంభయంగా బతుకుతున్నారు. తమను తిరిగి పాక్‌కు పంపించవద్దని, తాము భారత్‌లోనే ఉంటామని హిందూ శరణార్థులంతా కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
పాకిస్తాన్‌లో హిందూ మైనార్టీల పరిస్థితి దారుణంగా ఉందని, తిరిగి వెళ్తే తమను మళ్లీ హింసిస్తారని ఆవేదన చెందుతున్నారు. నరకం లాంటి పాకిస్తాన్‌కు వెళ్లడం కంటే, ఇండియాలో చావడానికైనా సిద్ధమని అంటున్నారు. ఆస్తులన్నీ అమ్ముకుని వచ్చామని, అక్కడ తమకు ఎవరూ లేరని.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని వాపోతున్నారు.
ఢిల్లీ, రాజస్థాన్‌లో రెఫ్యూజీ క్యాంపులు..
పాకిస్తాన్ నుంచి పొట్ట చేతపట్టుకుని భారత్‌కు వచ్చిన హిందూ శరణార్థులు రెఫ్యూజీ క్యాంపులలో ఉంటున్నారు. అలా కొంతమంది ఢిల్లీలోని మజ్నూ కా తిల్లా, రాజస్తాన్ జైసల్మేర్‌లోని ఏకలవ్య భిల్ బస్తీలో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వాళ్లంతా తమ పరిస్థితి ఏంటి..? అని ఆందోళన చెందుతున్నారు. ‘‘మేం పాకిస్తాన్‌లోని సింధు ప్రాంతంలో ఉండేవాళ్లం. అక్కడ మమ్మల్ని నిత్యం వేధింపులకు గురిచేశారు. దీంతో ఆస్తులన్నీ అమ్ముకుని కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాం. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొద్ది గంటల ముందే మేం ఇక్కడికి చేరుకున్నాం.
ఇప్పుడు వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోతం. ఇండియాలో చావడానికైనా సిద్ధమే గానీ, నరకం లాంటి పాకిస్తాన్‌కు మాత్రం వెళ్లం” అని జైసల్మేర్‌లోని ఏకలవ్య భిల్ బస్తీలో ఉంటున్న హిందూ శరణార్థి ఖేట్ రామ్ వాపోయాడు. ‘‘మేం గత కొన్నేండ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. ఇక్కడికి ఒకట్రెండు నెలల కింద వచ్చినోళ్లు కూడా ఉన్నారు. మా వీసాలను భారత ప్రభుత్వం రెండేండ్లకోసారి రెన్యూవల్ చేస్తున్నది.
ఉగ్రదాడి నేపథ్యంలో శరణార్థులందరి డాక్యుమెంట్లను పోలీసులు మళ్లీ చెక్ చేస్తున్నారు. ఇప్పుడేం జరుగుతుందో తెలియక అందరూ ఆందోళన చెందుతున్నారు’’ అని ఢిల్లీ మజ్నూ కా తిల్లాలోని హిందూ శరణార్థుల కమ్యూనిటీ అధ్యక్షుడు సోనాదాస్ తెలిపారు. తాము ఎన్నో ఏండ్లుగా ఇక్కడ ఉంటున్నామని, ఇప్పుడు వెళ్లగొట్టవద్దని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.