సత్తుపల్లి, వెలుగు: దేవాదాయ శాఖను రద్దుచేసి విశ్వహిందూ పరిషత్‌ను కొనసాగించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఏర్పాటుచేసిన సకల జన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. ఇంటి గుమ్మం వరకే ఎవరికైనా కులం అని, గడప దాటితే మనందరిది ఒకటే సమాజం అని చెప్పారు. దేశంలోని దేవాలయాలను హిందువులే నడుపుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
కుల రహితంగా కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో ఒకచోట చేరి భోజనాలు చేయడం అభినందనీయం అన్నారు. మనం ఏ పని చేసినా అది తప్పు పట్టరానిదై ఉండాలని చెప్పారు. మాలధారణ చేసి దీక్ష చేపట్టిన వారిలో కులభేదం ఉండకూడదన్నారు. సమాజంలో ధనిక, పేద అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఎవరికి వారు తమ కులంలోని పేదలకు చేయూత అందిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు.