తొడ కొట్టి చక్రం తిప్పిన బాలయ్య: హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కైవసం

తొడ కొట్టి చక్రం తిప్పిన బాలయ్య: హిందూపూర్ మున్సిపాలిటీ టీడీపీ కైవసం

అనంతపురం: టీడీపీ కంచుకోట హిందూపురం మున్సిపాలిటీలో మరోసారి పసుపు జెండా రెపరెపలాడింది. మున్సిపాలిటీ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో సోమవారం మున్సిపాలిటీ ఎన్నిక జరిగింది. వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ రసవత్తర పోరులో టీడీపీ అభ్యర్థి రమేష్ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 23 మంది కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14  ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి గెలుపులో ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. 

ALSO READ : వైసీపీకి దూరమై.. నందమూరి ఫ్యామిలీకి దగ్గరై.. విజయసాయిరెడ్డి రూటే సపరేటు..

సినిమా షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ నుంచి హుటాహుటిన హిందూపురం వెళ్లారు. అక్కడే మకాం వేసి కౌన్సిలర్లు ఎవరూ జారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హిందూపురం మున్సిపాలిటీ మళ్లీ వైసీపీ చేతుల్లోకి వెళ్లకూడదని బాలయ్య కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో రాజకీయం చేసి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి బాలయ్య చక్రం తిప్పారు.

2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. అదే ఊపులో.. హిందూపురం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ సత్తా చాటి టీడీపీ కంచుకోటలో జెండా పాతింది. 2019లో జగన్ సునామీని కూడా తట్టుకుని నిలబడి హిందూపురంలో బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు బాలకృష్ణ చేయని ప్రయత్నమంటూ లేదు. 

అయితే.. 2021లో జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బాలయ్య ప్రయత్నాలన్నీ విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి. హిందూపూర్ మున్సిపాలిటీలో కూడా వై‌సీపీ గెలిచి రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. 2021లో జరిగిన హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో.. మొత్తం 38 వార్డుల్లో వైసీపీకి 27, టీడీపీకి 6, బీజేపీకి 1, ఎంఐఎం 1, ఇతరులుకు ఒక వార్డు దక్కింది.

కాలక్రమంలో రోజులు మారిపోయాయి. ఓడలు బళ్లయ్యాయి. బళ్లు ఓడలయ్యాయి. 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో.. హిందూపురం మున్సిపాలిటీలో కూడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 

హిందూపురం చైర్‌పర్సన్‌గా వైసీపీ నుంచి గెలిచిన ఇంద్రజ 2024లో ఫ్యాన్ పార్టీ ఓటమితో వైసీపీకి గుడ్ బై చెప్పారు. 2024 ఆగస్ట్లో ఆమె వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అధికార టీడీపీలో చేరిపోయారు. పోతూ.. పోతూ.. 8 మంది వైసీపీ కౌన్సిలర్లను కూడా తన వెంట తీసుకెళ్లి పసుపు పార్టీలో చేర్పించేశారు. ఈ పరిణామంతో హిందూపురం మున్సిపాలిటీలో చైర్ పర్సన్ ఎంపిక అనివార్యమైంది.