దీపావళి విందులో మాంసం, మందు బ్రిటన్ ప్రధానిపై హిందువుల ఆగ్రహం

దీపావళి విందులో మాంసం, మందు బ్రిటన్ ప్రధానిపై హిందువుల ఆగ్రహం

లండన్: లండన్‌‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌‌లో ప్రధాని కీర్ స్టార్మర్​ ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి రిసెప్షన్‌‌ లో నాన్ వెజ్, ఆల్కహాల్‌‌ పెట్టడంపై బ్రిటిష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇలాంటి వేడుకలు నిర్వహించే ముందు సరైన సలహాలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఇన్‌‌సైట్ యూకే.. హిందూ పండుగ ఆధ్యాత్మికతపై అవగాహన లేకపోవడాన్ని ప్రశ్నించగా.. మరికొందరు అలాంటి మతపరమైన సంఘటనలపై ఎక్కువ చర్చలు అవసరమని సూచించారు. “దీపావళి అనేది పండుగ మాత్రమే కాదు. లోతైన మతపరమైన అర్థాన్ని కూడా కలిగి ఉంది. పవిత్రమైన దీపావళి పండుగ స్వచ్ఛత, భక్తిని నొక్కి చెబుతుంది. 

కేవలం సంప్రదాయకంగా శాఖాహార భోజనాలు మాత్రమే చేయాలి. మద్యపానానికి కచ్చితంగా దూరంగా ఉండాలి" అని ఇన్‌‌సైట్ యూకే ఎక్స్​ పోస్ట్‌‌లో పేర్కొంది. “ప్రధానమంత్రి స్వయంగా నిర్వహించే దీపావళి వేడుకలో మెనూ ఎంపిక దీపావళి పండుగకు సంబంధించిన మతపరమైన సంప్రదాయాలపై అవగాహన, గౌరవం లేకపోవడాన్ని ప్రదర్శిస్తుంది. ఈ అంశంపై హిందూ సమాజ సంస్థలు, మత పెద్దలను సంప్రదించారా అనే సంబంధిత ప్రశ్న కూడా ఇది లేవనెత్తుతుంది” అని పేర్కొంది. 

అయితే, దీపావళి విందు అనేది ఒక క్రాస్ కమ్యూనిటీ సమావేశమని, ఇందులో విస్తృత శ్రేణి ప్రతినిధులు పాల్గొన్నారని, బందీ చోర్ దివాస్ సిక్కు వేడుకలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. “మేము మీ వారసత్వం, సంప్రదాయాలకు విలువనిస్తాము. గౌరవిస్తాము. ఇది కలిసి వచ్చే సమయం, స్వాగతించే సమయం. చీకటిపై వెలుగు సాధించిన విజయంగా చూడండి” అని పేర్కొన్నాయి.