ఢాకా: బంగ్లాదేశ్‌లో తమపై జరుగుతున్న దాడులకు నిరసనగా అక్కడి హిందువులు ఆందోళనలు చేపట్టారు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. వాళ్లకు సంఘీభావం తెలుపుతూ వేలాది మంది ముస్లింలు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఢాకా, చిట్టగాంగ్‌లో హిందువులు భారీ ర్యాలీలు చేపట్టారు. చిట్టగాంగ్ లోని చారిత్రక చెరగి పహార్ స్క్వేర్ లో చేపట్టిన ర్యాలీకి ఏకంగా 7 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అలాగే, బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా కెనడాలోని టోరంటోలో నిర్వహించిన ఆందోళనలో వేలాది హిందువులు పాల్గొన్నారు.
హిందువులపై 205 దాడులు..
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి.. ఇండియాకు పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలోని మైనార్టీలపై దాడులు మొదలయ్యాయి. అల్లరి మూకలు హిందువులు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇండ్లను తగులబెడుతూ, ఆలయాలను ధ్వంసం చేస్తున్నాయి. హిందువులపై ఇప్పటి వరకు 52 జిల్లాల్లో 205 దాడులు జరిగాయని హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ దాడులను అరికట్టాలని కోరుతూ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ కు లేఖ రాశాయి.
వాళ్లంతా మనోళ్లే: యూనస్
మైనార్టీలపై జరుగుతున్న దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ఖండించారు. ఇది చాలా దారుణమని ఆయన అన్నారు. హిందువులు, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్ లను దాడుల నుంచి కాపాడాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ‘‘వాళ్లు మన దేశ ప్రజలు కాదా? దేశాన్ని కాపాడగలిగిన మీరు..
కొన్ని కుటుంబాలను కాపాడలేరా? ఎలాంటి హాని జరగనివ్వబోమని వాళ్లకు భరోసా ఇవ్వండి. వాళ్లంతా మనోళ్లే.. మనందరం కలిసి కొట్లాడుదాం.. కలిసి ఉందాం” అని విద్యార్థులకు యూనస్ పిలుపునిచ్చారు.