ఉగ్రవాదాన్ని కూడా కొన్ని దేశాలు పొలిటికల్ టూల్‌గా మార్చుకుంటున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఐక్య రాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‌పై కామెంట్ చేశారు. టెర్రరిజాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్న దేశం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒక్కటేనని, ఆ ఉగ్రవాదం ప్రపంచ దేశాలతో పాటు వాళ్లకు కూడా ప్రమాదమేనని గుర్తించాలని పాక్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్ టెర్రరిజానికి అడ్డాగా మారకుండా చూడడం చాలా అవసరమని, అక్కడి నుంచి ఇతర దేశాలపై దాడులకు వాడుకోకుండా చూడాలని అన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులను ఏ దేశమూ అదునుగా తీసుకుని తమ స్వార్థపూరిత అవసరాలకు వాడుకోకుండా చూడాలని చెప్పారు.
ప్రస్తుతం అఫ్గాన్ ప్రజలు, మహిళలు, పిల్లలు, మైనారిటీలకు మన సాయం అవసరమని, వాళ్లకు చేయడం ద్వారా మన బాధ్యతను నిర్వర్తించాలని మోడీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి కేంద్ర కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ఆయన శనివారం ప్రసంగించారు. ఉగ్రవాదం వల్ల ప్రపంచమంతా సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు.