మనిషి ఎంత గొప్పగా జీవించాడనేది వారికున్న ఆస్తిపాస్తులతో కాకుండా.. ఆ వ్యక్తి ఆలోచనా విధానం ఎంత ఉన్నతంగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన అసామాన్య, పరిపూర్ణ జీవితాన్ని పొందిన మాతృమూర్తి హీరాబెన్ మోడీ. ఏ తల్లి అయినా తాను జన్మనిచ్చిన సంతానం ఉన్నతంగా బతకాలని కోరుకుంటుంది. ఇలా కోరుకోవడానికి పేదరికం ఏమాత్రం అడ్డుకాదు. కానీ ఎన్నో సంఘర్షణలు, మరెన్నో కష్టనష్టాలు ఎదురైనా, తన ఆలోచనలకు అనుగుణంగా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ వారిని ఉన్నతంగా చూసే తల్లిదండ్రులే మన సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ జీవితం కూడా ఇలాంటిదే. యావద్భారతం గర్వించే, యావత్ ప్రపంచం అభిమానించే మహోతన్నత వ్యక్తిత్వాన్ని నిర్మించడమే కాకుండా.. తన కొడుకు.. గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చూసే అరుదైన అవకాశం కలిగిన మహాతల్లి, అదృష్టవంతురాలు హీరాబెన్. అందుకే ఆ మాతృమూర్తి జీవితం పరిపూర్ణం. వందేళ్లు జీవించడం ఒక్కటే కాదు.. ఆ వందేండ్ల జీవితాన్ని సార్థకం చేసుకోవడం అందరికీ లభించే అదృష్టం కాదు. కొడుకు ప్రధానమంత్రి అయినా.. తాను మాత్రం అవేవీ పట్టనట్లు హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఆమె గడిపిన నిరాడంబరమైన, విలువలతో కూడిన జీవితం.. నేటి ప్రపంచానికి ఓ సందేశం. పేదరికం, సంఘర్షణలతో సంబంధం లేకుండా తన పిల్లలను ప్రయోజకుల్ని చేసి ఈ దేశానికి అంకితం చేసేందుకు పడిన తపన, చేసిన కృషి సమాజానికి ప్రేరణాత్మకం.
మోడీ వెనుక హీరాబెన్ మోడీ
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవితంలో ఆ మహిళ తల్లి హీరాబెన్. ఆమె జీవితాంతం కష్టపడ్డారు. ఎప్పుడూ ఒకరి నుంచి ఏమీ ఆశించలేదు. పిల్లలకూ అలాంటి నడవడికే నేర్పారు. అదే వారిని స్వశక్తితో పైకి ఎదిగేలా, దేశం కోసం పని చేసేలా మార్చింది. దేశానికి మోడీ లాంటి గొప్ప నాయకుడు నేతృత్వం వహించడం వెనుక ఆయన తల్లి హీరాబెన్ నేర్పిన నడవడిక స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని మోడీకి, ఆయన తల్లితో చాలా గొప్ప అనుబంధం ఉంది. ఈ విషయాన్ని ఆయనే 2022 జూన్ 18వ తేదీన హీరాబెన్ మోడీ100వ పుట్టినరోజు సందర్భంగా తన బ్లాగ్‌లో పంచుకున్నారు. అమ్మ పైన ఆయన భావోద్వేగాన్ని వెల్లడించారు. ‘అమ్మ అన్నది ఒక పదం కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం. అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ. చాలా చిన్న వయసులోనే ఆమె మాతృమూర్తిని కోల్పోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. అయినా బలంగా నిలబడింది’’ అని మోడీ రాశారు. తన ఎదుగుదల కోసం హీరాబెన్మోడీ ఎన్నో త్యాగాలు చేశారని మోడీ గుర్తు చేసుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, తనలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రేరణ నిచ్చింది తన తల్లేనని ప్రధాని చెప్పారు. అమ్మ ఇంట్లో పనులన్నీ తాను ఒక్కతే చేసుకునేదని, ఇంటి పోషణ కోసం కూడా కష్టపడేదని, వేరే వాళ్ల ఇండ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు మద్దతుగా నిలిచేదని మోడీ తెలిపారు. వర్షానికి ఇల్లంతా కురిసినా, వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేదని, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, తన తల్లి ఎంతో దృఢంగా నిలిచిందని మోడీ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. హీరాబెన్పేరుతో ఎలాంటి ఆస్తులు లేవని, బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదని, ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదని పేర్కొన్న మోడీ, ఆమె గతంలో మాదిరి అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగిస్తున్నారని తెలిపారు. అమ్మతో కలిసి బయటకు వెళ్లిన సందర్భాలు చాలా తక్కువని పేర్కొన్న మోడీ, 2001లో తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన వెంట అమ్మ ఉందని గుర్తు చేసుకున్నారు.
పుట్టెడు దు:ఖంలోనూ మోడీ విధులకు
హీరాబెన్ వ్యక్తిత్వ ప్రభావం ప్రధాని మోడీపై బలంగా పడింది. ఆయన రోజుకు18 గంటలు పనిచేయడం వెనుక, తన తల్లి రోజంతా చేసిన కష్టం తాలూకు స్ఫూర్తి దాగి ఉన్నది. ‘మా అమ్మ ఆలోచన విధానం, ముందుచూపు నాలో నిత్యం స్ఫూర్తి నింపేవి’ అని ప్రధాని పలు సందర్భాల్లో గుర్తు చేశారు. సాధారణ కుటుంబంలో పుట్టి, తన కొడుకును అసాధారణ వ్యక్తిగా తీర్చిదిద్ది, జీవితాంతం విలువలకు కట్టుబడి ఉండి నిరాడంబర జీవితం గడిపిన హీరాబెన్ నిజంగా ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. పరిపూర్ణ జీవితం చూసిన ఆ మహా తల్లికి అశ్రు నివాళి. తన తల్లి అంత్యక్రియలు అత్యంత సాధారణంగా ముగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇంతటి బాధలోనూ అప్పటికే షెడ్యూల్చేసిన విధులు నిర్వర్తించారు. ఇంతటి బాధలోనూ దేశానికే మొదటి ప్రాధాన్యం ఇచ్చి.. బెంగాల్‌లోని పలు ప్రాజెక్టుల ప్రారంభానికి వర్చువల్‌గా హాజరయ్యారు. తన కోసం కేంద్ర మంత్రులెవరూ షెడ్యూల్ మార్చుకోవద్దని, పని పూర్తయ్యాకే ఢిల్లీకి రావాలని కూడా సూచించారు. జన్మనిచ్చిన తల్లి స్వర్గస్థులయ్యారన్న పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని దేశ ప్రజల సేవకు అంకితమైన ప్రధాని మోడీ నిజంగా ఓ కర్మయోగి! తల్లి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. మాతృవియోగంతో ఉన్న నరేంద్ర మోడీకి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ..!!
ఢిల్లీలో ఉండటానికి ఇష్టపడలే..
కుటుంబ ఆర్థిక కారణాలతో చదువుకోలేకపోయిన హీరాబెన్ మోడీ, తన పిల్లలకు అలాంటి పరిస్థితి రాకూడదని భావించారు. ఆరుగురు పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలని ఆమె బాగా కష్టపడ్డారు. ఆమె సంతానంలో ముగ్గురు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ కాగా, నరేంద్ర మోడీ నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు రెండోసారి భారత ప్రధానిగా ఉన్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అన్నట్లు నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయినా.. తన తల్లికి సాధారణ కొడుకులాగే చివరి వరకు దగ్గర ఉండి అన్ని సపర్యలు చేశారు. ఎప్పటికప్పుడు ఆమె బాగోగులు చూసుకున్నారు. కరోనా సమయంలో ఢిల్లీలో తన వద్ద ఉంచుకోవడానికి ఆమెను గుజరాత్ నుంచి తీసుకువెళ్లినా, నిరాడంబర వ్యక్తిత్వం కలిగిన ఆ మహా తల్లి.. అక్కడ రెండు రోజులకు మించి ఉండలేక పోయారు. తన ఇంటిలోనే ఉంటాను అంటే.. ప్రధాని మోడీ కాదనలేదు.
- జి. కిషన్ రెడ్డి,కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి