ఆ ఊరి అబ్బాయిలకు పెళ్లి కష్టాలు

అబ్బాయికి తమ పిల్లనివ్వాలంటే తల్లిదండ్రులు ఎన్నో విషయాలను ఆలోచిస్తారు. అతను ఏం పనిచేస్తాడు, ఎంత జీతం వస్తుంది. ఆస్తి ఎంత. గుణం ఎలాంటిదని తెలుసుకున్నాకే ఆడపిల్లను ఇచ్చేందుకు మొగ్గు చూపుతారు. అయితే  ఇవన్నీ ఉన్నా కూడా ఓ ఊర్లో యువకులకు పెళ్లిళ్లు అవడం లేదు. ఆ ఊరి పేరు చెబితేనే అమ్మాయి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. అమ్మో ఆ ఊరికి తమ బిడ్డనిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. 

మహరాష్ట్ర నాసిక్ జిల్లాలోని హిరిద్ పాడ అనే గ్రామం ఉంది. ఈ ఊర్లో పెళ్లి కాని అబ్బాయిలు వందల మంది ఉన్నారు. ఆస్తి, గుణం ఉన్నా కానీ.. హిరిద్ పాడ అబ్బాయిలకు పిల్లనివ్వడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఇష్టపడరు. కారణం ఈ  గ్రామంలో తాగునీటి కష్టాలే. తాగునీరు కోసం కిలోమీటర్ల మేర దూరం నడవాల్సి ఉంటుంది. గ్రామంలో నల్లా కనెక్షన్ లేదు. నీటి కోసం బోర్లు వేసినా, భూమిలో నుంచి నీళ్లు రావు. ఊరికి చాలా దూరంలో ఓ బావి ఉంది.  అందులో నీటినే తాగడానికి గ్రామ ప్రజలు ఉపయోగించుకుంటారు. దీంతో తమ పిల్లను ఈ ఊరికి ఇస్తే, వారు కూడా నీటి కష్టాలు పడాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావిస్తారు.  అందుకే హిరిద్ పాడ గ్రామ అబ్బాయిలకు వారు పిల్లని ఇవ్వడం లేదు. 

నీటి కష్టాలతో జనం వలస..
హిరిద్‌పాడ గ్రామంలో తాగునీటి ఇబ్బందులు వర్ణణాతీతం. ఇక్కడి ఉండి నీటి కష్టాలను పడలేక...గ్రామంలో ఉండలేక ఎన్నో కుటుంబాలు ఉరిని విడిచి వెళ్లిపోయాయి. కొందరు మహిళలు అయితే పరిస్థితిని తట్టుకోలేక..తమ భర్తలను విడిచి పుట్టింటికి వెళ్లిపోయారు. 

ఓవైపు నీటి కష్టాలు, మరోవైపు పెళ్లి కష్టాలు
వేసవి కాలం వచ్చిందంటే చాలు..తమకు నీటి కష్టాలు మొదలవుతాయంటున్నారు స్థానికులు. వానాకాలం, చలికాలంలో నీరు లభించినా..వేసవిలో మాత్రం నీటికోసం నరకం చూడాల్సి వస్తుందని చెబుతున్నారు. నీటి కోసం పడే ఇబ్బందులు ఒక ఎత్తయితే..పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు పడే కష్టం మరొకెత్తు అంటున్నారు. తమ నీటికష్టాలు ఎప్పుడు తీరుతాయో తమ గ్రామంలోని యువకులకు పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో అని స్థానికులు చింతిస్తున్నారు.