జనగామ, వెలుగు : జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆయన భార్య నీలిమ చెప్పారు. బుధవారం జనగామ పట్టణంలోని 30వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ పల్లాకు ఓటు వేయాలని కోరారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. పల్లాను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
అలాగే జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మున్సిపాలిటీలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రచారం నిర్వహించి, మాట్లాడారు. లోకల్, నాన్ లోకల్ అని కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. తాను ఇక్కడివాడినేనని తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. చేర్యాల ప్రజలకు ఏం కావాలో తనకు తెలుసని, రెవెన్యూ డివిజన్ విషయమై జనగామ ఆశీర్వాదసభలో సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. రెవెన్యూ డివిజన్‌గా మార్పించే బాధ్యత తనదేనన్నారు.
చేర్యాల సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులను కేసీఆర్‌ను అడిగి తీసుకుందామన్నారు. ఇప్పుడు ఇచ్చిన రూ. 10 కోట్లు సరిపోకుంటే మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎలక్షన్లు ముగిసిన నెల రోజుల్లో పింఛన్లు మంజూరు చేయిస్తానన్నారు. గృహలక్ష్మి కింద 3 వేల ఇండ్లు ఇచ్చామని, ఈ సంఖ్యను డబుల్ చేయిస్తానన్నారు. అభివృద్ధి సంక్షేమం కేసీఆర్‌తోనే సాధ్యమని, అందుకే బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం మద్దూరు మండలం వంగపల్లి పంచాయతీ పరిధి ఉప్పరోనిగడ్డకు చెందిన పలువురు మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి పల్లా కండువాలు కప్పి ఆహ్వానించారు.