బీదర్.. అనగానే చాలామందికి ఒక సినిమాలో కమెడియన్ అలీ చేసిన ఇసుక సీన్ గుర్తుకు వస్తుంది. కామెడీ విషయాలను పక్కన పెడితే అక్కడ చారిత్రక కట్టడాలను చూస్తే అద్భుతమైన ప్రదేశానికి వచ్చిన ఫీలింగ్ రావడం గ్యారెంటీ. హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్ వెళ్తే బిద్రీవేర్ వస్తువులు, గంధపు చెక్క బొమ్మలు వెంట తెచ్చుకోవడం ఖాయం. అతి తక్కువ ధరతో మంచి ట్రిప్‌కి వెళ్లాలనుకుంటే కర్నాటకలోని బీదర్ బెస్ట్ ఆప్షన్.
బీదర్ కోట
కర్నాటకలోని టూరిస్ట్ అట్రాక్షన్స్‌లో ముఖ్యమైన కట్టడం బీదర్ కోట. దీన్ని ఎనిమిదో శతాబ్దంలో కట్టించారు. ఆ తర్వాత1428లో సుల్తాన్ అహ్మద్ షా బహమని ఈ కోటని పునఃనిర్మించాడు. కోట సముదాయాల్లో (కాంప్లెక్స్) రంగిన్ మహల్, జామీ మసీద్, సోలా ఖంబ మస్జీద్, తక్త్ మహల్ వంటివి ఉన్నాయి. ఈ కోట నిర్మాణం, ఆర్కిటెక్చర్ అద్భుతంగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు సినిమా షూటింగ్‌లు చేసేందుకు ఇస్తున్నారు కూడా.
రంగిన్ మహల్
రంగిన్ మహల్ అనేది బీదర్ కోటలో ఒక భాగం. రంగిన్ మహల్ అంటే పెయింటెడ్ ప్యాలెస్ అని అర్థం. దీనికి ఈ పేరు ఎందుకొచ్చిందంటే.. ఇందులో వాడిన టైల్స్ రంగురంగులుగా ఉంటాయి. చూడ్డానికి అచ్చం పెయింట్ వేసినట్టే అనిపిస్తుంది. అలాగే ఈ ప్యాలెస్‌లో హిందూ, ముస్లిం స్టయిల్లో కట్టిన ఆర్కిటెక్చర్ ఉంది. రాతి శిల్పాలు, పూల డిజైన్లను చూడాలంటే మహల్లోకి వెళ్లాల్సిందే. గోడలపైన ఖురాన్‌లోని కొన్ని వాక్యాలు రాసి ఉంటాయి.
పాప్నాశ్ శివ టెంపుల్
మనదేశంలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఒకటి బీదర్‌లో ఉన్న పాప్నాశ్ శివ టెంపుల్. ఈ గుడికి వెళ్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు భక్తులు. హిందువులకు ఇది ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ గుడిలో పాప్నాశ తీర్థ అనే ఒక ట్యాంక్ ఉంటుంది. అందులో మునిగితే పాపాలు పోతాయనేది భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడున్న శివలింగాన్ని శ్రీరాముడు అయోధ్య నుంచి లంకకు వెళ్లేటప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించాడని చెప్తారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణం మధ్యయుగంలో హిందూ ఆర్కిటెక్చర్ స్టయిల్లో కట్టింది. అసలైన గుడి నిర్మాణం తీర్థ యుగంలో కట్టిందనడానికి ఎలాంటి రికార్డులు లేవు. ఈ గుడిలో శివరాత్రి పర్వదినాన్ని ఎంతో వైభవంగా చేస్తారు.
కళ్లను కట్టిపడేసే కళ బిద్రీ
బిద్రీకళకు ఫేమస్ బీదర్. పాన్ బాక్స్‌లు, ప్లేట్లు, ట్రేలు, హుక్కాలు, గోబ్లెట్ వంటివాటిపై బిద్రీ డిజైన్ ఉంటుంది. కర్నాటక టూర్‌కి వెళ్తే బిద్రీవేర్ క్రాఫ్ట్స్ వెంట తెచ్చుకోవాల్సిందే. అంతగా ఆకట్టుకుంటాయి ఆ డిజైన్లు. ఇక్కడ బహ్మనీ బిద్రీ వర్క్స్ షో రూమ్, ఖాదీ గ్రామోద్యోగ్ సంఘ్, శాండల్‌వుడ్ క్రాఫ్ట్స్, తర్కరి మార్కెట్, గాంధీగంజ్ అదత్ మార్కెట్లు చాలా పాపులర్. ఈ క్రాఫ్ట్‌కు ఎంత గుర్తింపు ఉందంటే.. ప్యారిస్‌లోని లవ్రే మ్యూజియంలో చోటు దక్కించుకునేంత. గంధపు చెక్కతో తయారుచేసిన బొమ్మలు, శిల్పాలు, వస్తువులు.. ఇలా ఎన్నో వెరైటీలు
ఉంటాయక్కడ.
ఎలా వెళ్లాలంటే...
హైదరాబాద్ నుంచి బీదర్‌కు బస్‌లు ఉన్నాయి. టికెట్ దాదాపు ఆరు వందల రూపాయలు ఉంటుంది. ఇక్కడి నుంచి సుమారు 150 కిలో మీటర్లు దూరం. అంటే... నాలుగ్గంటల్లోపు అక్కడికి చేరుకోవచ్చు. ట్రైన్, ఫ్లైట్ జర్నీ కూడా చేయొచ్చు.
నరసింహ ఝిర కేవ్ టెంపుల్
బీదర్‌లో ఈ టెంపుల్ చాలా పాపులర్. ఈ ఆలయ దేవుడ్ని పూజించాలంటే భక్తులు నిరంతరం ప్రవహించే నీటి ప్రవాహం గుండా గుహలోపలికి వెళ్లాలి. గుహలో నడుములోతు నీళ్లుంటాయి. పైన గబ్బిలాలు తిరుగుతుంటాయి. గర్భగుడి లోపలికి ఒకేసారి ఎనిమిది మంది మాత్రమే వెళ్లగలరు. నీళ్లలో తడిచి వెళ్తారు కాబట్టి భక్తులు బట్టలు మార్చుకునేందుకు రూమ్‌లు ఉంటాయి.
బహ్మనీ సమాధులు
బీదర్‌లో మరో ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్ బహ్మనీ సమాధులు. ఇక్కడున్న12 సమాధుల సముదాయాన్ని మధ్యయుగంలో దక్షిణ భారతదేశాన్ని పాలించిన బహ్మనీ పాలకులకు అంకితం చేశారు. బీదర్‌లోని అష్టూర్లో అందంగా చెక్కిన సమాధులు కనిపిస్తాయి. వాటిపై ఖురాన్‌లోని వాక్యాలు బంగారు వర్ణంలో రాసి ఉంటాయి. సమాధి గోడలపై పెయింటింగ్స్ ఉన్నాయి. సమాధులన్నింటికీ ఆర్చ్‌లు, పెద్ద గోపురాలు ఉన్నాయి.
గురుద్వారా నానక్ ఝిర సాహిబ్
గురుద్వారా నానక్ ఝిర సాహిబ్ ఇది సిక్కులకు సంబంధించిన చారిత్రక పుణ్యస్థలం. దీన్ని గురునానక్‌కు అంకితం చేశారు. గురునానక్ జయంతి వేడుకలను ఇక్కడ బాగా చేస్తారు. గురుద్వారా చుట్టూ మూడు వైపులా అందమైన లోయలు, కొండలు ఉంటాయి. ఇక్కడ మందిరంలో దివాన్ హాల్, లంగర్ హాల్, దర్బార్ సాహిబ్ ఉంటాయి. వసంత కాలం వస్తుందనగా ఒక చిన్న ట్యాంక్‌లో పవిత్ర జలాన్ని నింపుతారు. దాన్ని అమృత్ కుండ్ అంటారు. అందులో మునిగితే పాపాలు పోతాయని నమ్ముతారు. కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుచేస్తారు. అక్కడ పగలు, రాత్రి భోజనం ఉచితంగా పెడతారు. ఈ ప్రాంగణంలో మ్యూజియం కూడా ఉంది. అందులో గురునానక్ పెయింటింగ్స్, ఆయన జీవితంలోని ముఖ్యమైన అంశాలకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి.
చౌబరా టవర్
చౌబరా అంటే నాలుగు దిక్కులకు సమానం అని అర్థం. ఇది అతిపురాతనమైన వాచ్ టవర్. టవర్లా ఉండే ఈ బిల్డింగ్ 22మీటర్ల ఎత్తులో ఉండి, సిలిండర్ నిర్మాణంలో ఉంటుంది. ఇది బీదర్ టౌన్ సెంటర్లో ఉంటుంది. ఈ టవర్ పైకి ఎక్కి చూస్తే ఆ ప్రాంతమంతా కనిపిస్తుంది. పైకి వెళ్లడానికి ఎనిమిది మెట్లు ఉంటాయి.