
ప్రస్తుత కాలంలో సరైన సమయంలో పెళ్లి కాకపోవడం వల్ల యువతలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వేర్వేరు కారణాల వల్ల పెళ్లి సంబంధాలు కుదరకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. కొంతమంది యువత పెళ్లి కుదరకపోవడం వల్ల భయాందోళనకు గురై పిచ్చిపిచ్చి పనులు చేస్తున్న సందర్భాలు సైతం ఎక్కువగానే ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలో ఇడగుంజి వినాయకుడి దేవాలయానికి వెళితే వివాహఘడియులు వస్తాయి.
అయితే కొన్ని ఆలయాలను సందర్శించడం ద్వారా సులువుగానే పెళ్లి అవుతుంది. అలాంటి ఆలయాలలో ఇడగుంజి వినాయక స్వామి ఆలయం కూడా ఒకటి. వినాయకుడు బ్రహ్మచారే అయినప్పటికీ ఆయన దయ ఉంటే చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో ఈ వినాయకుని ఆలయం కూడా ఒకటి కావడం గమనార్హం.
ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉండగా కర్ణాటక రాష్ట్రంలో ఈ ఆలయం ఉంది. గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి అని భక్తులు బలంగా విశ్వసిస్తారు. మూలవిరాట్టైన వినాయకుడు ఈ ఆలయంలో చూడముచ్చటగా ఉంటాడు. ఈ ఆలయంలో వినాయకుని దగ్గర ఎలుక వాహనం కనిపించదు. ఈ ఆలయంలో వినాయకుడికి గరికెను సమర్పిస్తే కోరిన కోరికలు తీరతాయి.
ఇడగుంజి ఆలయంలోని వినాయకుడు
ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.
ఇడగుంజిలోని ఆచారం
కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశంపశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణలలో ఉన్నాయి.
స్థల పురాణం
కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతినదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలూ లేకుండానే యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు.
విష్ణుమూర్తి ఆలయం
ఇడగుంజి వినాయకుడి గుడికి దగ్గరగా 1000 సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన విష్ణుమూర్తి ఆలయం కూడా ఉంది. శ్రీ విష్ణుమూర్తి ఆలయం కర్నాటకలోని ఆలయాల్లో ఒకటి. ఇక్కడ చాలా ప్రశాంతంగా వుంటుంది. ఇడగుంజి సమీపంలోని బల్కుర్ విష్ణుమూర్తి ఆలయానికి అడవి దారుల్లో నడుస్తూ వెళ్ళవచ్చును. ఈ ఆలయం ఇడగుంజి వినాయక ఆలయం నుండి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.
విష్ణుమూర్తి ఆలయం ప్రాంగణంలో ప్రకృతిదృశ్యాలు చాలా వర్ణనాత్మకంగా వుంటాయి. ఇక్కడ ఎటువంటి కాలుష్యం లేని వాతావరణంలో మీ సమయాన్ని గడపవచ్చును. వినాయకుని ఆలయాన్ని సందర్శించినప్పుడు అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా సందర్శించి దీవెనలు తీసుకోవచ్చును.
ఓం గం గణపతయే నమః